Parakamani Case : హైకోర్టు ఆదేశాలతో వణుకుతున్న ఖాకీలు..!
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తులు సమర్పించే కానుకలను దొంగిలించడం మహా అపచారం. అయితే, ఆ దొంగలను చట్టం ముందు నిలబెట్టాల్సిన రక్షకభటులే, భక్షకభటులుగా మారి నిందితులతో చేతులు కలపడం అంతకంటే ఘోరమైన నేరం. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీ కేసులో ఇప్పుడు సరిగ్గా ఇదే చర్చ జరుగుతోంది. శ్రీవారి సొమ్మును అపహరించిన నిందితుడు రవికుమార్, మరికొందరితో అప్పటి పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని సీఐడీ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనిపై హైకోర్టు సీరియస్ అయి వారిపై చర్యలకు ఆదేశించడం ఏపీ పోలీసు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
పరకామణిలో చోరీ కేసును సాధారణ దొంగతనంగా కూడా చూడకుండా, అత్యంత బలహీనమైన సెక్షన్లతో నమోదు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. నిందితుడిని కాపాడేందుకు వ్యవస్థలోని లోపాలను, లోక్ అదాలత్ వంటి వేదికలను పోలీసులు వాడుకున్న తీరు విస్తుగొలుపుతోంది. కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడం మినహా, మిగిలిన అంశాలపై చట్టప్రకారం విచారణ జరపవచ్చని హైకోర్టు స్పష్టం చేయడంతో, ఈ కేసులో పోలీసుల పాత్రపై సీఐడీ, ఏసీబీలు దూకుడు పెంచాయి.
పరకామణి చోరీ కేసును నీరుగార్చడంలో అప్పట్లో తిరుమల, తిరుపతిలో పనిచేసిన పలువురు అధికారుల పేర్లు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ కేసును తప్పుదోవ పట్టించడంలో అప్పటి తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్మోహన్ రెడ్డిది ప్రధాన పాత్రగా ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో కనీస వివరాలు లేకుండా చూడటం, నేర తీవ్రతను తగ్గించే సెక్షన్లు పెట్టడం, కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకునేలా ఫిర్యాదుదారులపై ఒత్తిడి తేవడం.. ఇలా అడుగడుగునా నిందితులకు సహకరించారనేది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఆయన్ను సీఐడీ ఇప్పటికే విచారించింది.
సాక్షాత్తు ఆలయంలో చోరీ జరిగితే, నిందితుడు రవికుమార్‌ను అరెస్టు చేయకుండా కేవలం 41ఏ నోటీసు ఇచ్చి పంపించడంలోనే అప్పటి ఎస్సై రామలక్ష్మీరెడ్డి పాత్ర అర్థమవుతోంది. నిందితుడి కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆయన, ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి కేసును రాజీ మార్గంలో నడిపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక.. నిందితుడి విచారణ, ఆస్తుల పరిశీలన, రికవరీ విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా నడుచుకున్నారనే ఆరోపణలు అప్పటి తిరుపతి టూ టౌన్ సీఐ చంద్రశేఖర్‌పై ఉన్నాయి.
కేవలం కింది స్థాయి సిబ్బందే కాదు, ఈ వ్యవహారంలో ఐపీఎస్ స్థాయి అధికారుల పాత్ర కూడా కీలకంగా కనిపిస్తోంది. ఆలయ భద్రతకు బాధ్యత వహించాల్సిన సీవీఎస్వో స్థానంలో ఉండి, తనకు తెలియకుండానే కింది స్థాయి అధికారి ఏవీఎస్వో కేసును రాజీ చేసుకోగలరా? అని సీఐడీ ఆయన్ను సూటిగా ప్రశ్నించింది. లోక్ అదాలత్‌లో రాజీకి ఆయనే ఒత్తిడి తెచ్చారా? ఎవరి ఆదేశాల మేరకు ఈ పని చేశారు? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇక దర్యాప్తును ముందుకు సాగనీయకుండా చేయడంలో, కేసును రాజీ చేయడంలో అప్పటి ఎస్పీ పరమేశ్వరరెడ్డి కీలక పాత్ర పోషించారని, కొంతమంది రాజకీయ నాయకుల ఆదేశాలతో ఆయన తెరవెనుక చక్రం తిప్పారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
ఇది కేవలం ఒక దొంగతనం కేసు కాదు, వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఘటన. నిందితుడి నుంచి ఎంత మొత్తం రికవరీ చేశారు? అసలు దొంగిలించింది ఎంత? అనే లెక్కల్లో కూడా భారీ వ్యత్యాసం ఉన్నట్లు అనుమానాలున్నాయి. హైకోర్టు తాజా ఆదేశాలతో, ఈ కేసులో పోలీసుల ప్రమేయంపై లోతైన దర్యాప్తు జరగనుంది. “తిరుమల కొండలో చేసిన పాపాలు ఊరికే పోవు” అన్నట్లుగా.. దేవుడి సొమ్ము కాజేసిన వారికి సహకరించిన పోలీసులపై ఇప్పుడు శాఖాపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు తప్పేలా లేవు. త్వరలోనే మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇందులో ప్రమేయం ఉన్న పోలీసులు వణికిపోతున్నారు.






