AP High Court: పరకామణి చోరీ కేసులో హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల క్షేత్రంలో.. భక్తులు శ్రీవారిపై ఎంతో భక్తితో సమర్పించే కానుకలు దారి మళ్లడమే ఒక అపచారం అనుకుంటే, ఆ దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే వారితో చేతులు కలపడం వ్యవస్థలోని డొల్లతనానికి నిదర్శనం. టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం వెలువరించిన వ్యాఖ్యలు, జారీ చేసిన ఆదేశాలు ఈ వ్యవహారంలోని తీవ్రతను కళ్లకు కట్టాయి.
ఈ కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం పోలీసుల పాత్ర. పరకామణిలో చోరీకి పాల్పడ్డ నిందితులతో అప్పటి పోలీసులు కుమ్మక్కయ్యారని, దొంగిలించిన సొమ్మును నిందితుడి నుంచి రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సింది పోయి.. ఆ సొమ్మును పోలీసులే పంచుకున్నారన్న ఆరోపణలు న్యాయస్థానాన్ని విస్మయానికి గురిచేశాయి. దీనిపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర స్వరంతో స్పందించింది.
“నిందితులతో చేతులు కలిపిన పోలీసులపై కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకుంటే సరిపోదు.. వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలి” అని న్యాయమూర్తి సీఐడీ (CID) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులైన పోలీసు అధికారుల ఆదాయానికి మించి ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఏసీబీ (ACB), సీఐడీ సంయుక్తంగా లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. తప్పు చేసిన వారు ఖాకీ దుస్తుల్లో ఉన్నా ఉపేక్షించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు, పరకామణిలో చోరీలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలపై టీటీడీ హైకోర్టుకు సమర్పించిన నివేదికపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనే న్యాయస్థానం మెరుగైన, ప్రత్యామ్నాయ విధానాలపై నివేదిక కోరగా.. టీటీడీ మంగళవారం సమర్పించిన నివేదికలో పస లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
కోర్టు ఆదేశిస్తే అమలు చేస్తాం అని టీటీడీ న్యాయవాది చెప్పగా.. క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత మీదేనని, మీ నుంచి సరైన సూచనలు, సలహాలు లేకుండా కోర్టు ఎలా ఆదేశాలు ఇస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను, ఆలయ పవిత్రతను కాపాడటంలో టీటీడీ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఈ క్రమంలో ఈఓతో చర్చించి సమగ్ర వివరాలతో వస్తామని టీటీడీ కోరడంతో విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.
ఈ కేసు మూలాలు తిరుమల పరకామణి లో పనిచేసిన మాజీ ఉద్యోగి చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో పరకామణిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అతను విదేశీ కరెన్సీని, డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. చోరీ చేసిన అతడిని విచారించిన అప్పటి తిరుమల క్రైమ్ పోలీసులు.. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న పూర్తి మొత్తాన్ని రికార్డుల్లో చూపించలేదు. దొంగిలించిన సొమ్ములో కొంత భాగాన్ని రికవరీ కింద చూపి, మిగిలిన భారీ మొత్తాన్ని ఆ కేసును డీల్ చేసిన పోలీసులే వాటాలుగా పంచుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దొంగను శిక్షించాల్సిన పోలీసులే, దొంగ సొమ్మును మెక్కి కేసును నీరుగార్చడం అప్పట్లో పెను సంచలనమైంది. పైగా ఆ తర్వాత దొంగతో లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడం మరింత సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ విచారణలోనే ప్రస్తుతం హైకోర్టు పోలీసుల ఆస్తుల ఆరా తీయాలని ఆదేశించడం గమనార్హం.
తాజా హైకోర్టు ఆదేశాలు రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ఒకటి, శ్రీవారి సొమ్ము విషయంలో అవకతవకలకు పాల్పడితే న్యాయస్థానాలు ఉపేక్షించవు. రెండు, యూనిఫామ్ అడ్డం పెట్టుకుని నేరాలకు పాల్పడే అధికారులకు ఈ కేసు ఒక హెచ్చరిక లాంటిది. రానున్న రోజుల్లో ఏసీబీ, సీఐడీ దర్యాప్తులో ఎంతమంది పోలీసుల అక్రమాస్తులు బయటపడతాయో వేచి చూడాలి.






