Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై బాంబ్ పేల్చిన కవిత..!

కేసీఆర్ కుటుంబంలోని (KCR Family) కలహాలు వాళ్లకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత (Kavitha) పలు సంచలన ఆరోపణలు చేశారు. తన నాన్నకు, సోదరుడికి పార్టీలోని కొంతమంది వల్ల ముప్పు ఉందని ఆమె హెచ్చరించారు. మీడియాతో మాట్లాడిన అనంతరం చిట్ చాట్ లో కవిత ఫోన్ ట్యాపింగ్ పై మరిన్ని ఆరోపణలు చేశారు. హరీశ్ రావు (Harish Rao), సంతోష్ రావు (Santosh Rao), శ్రవణ్ రావు (Sravan Rao) ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. అంతేకాక తమ కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయన్నారు. దీంతో ఆ నలుగురు ఎవరు.. అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఒకవేళ ఈ అంశంపై కవిత పోలీసుల ముందుకెళ్లి వాంగ్మూలం ఇస్తే ఈ కేసు మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది.
పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాత కవిత ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్ ట్యాపింగ్ పై స్పందించారు. హరీశ్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావు కలిసి ఈ ట్యాపింగ్‌లకు పాల్పడ్డారని చెప్పారు. తమ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా టార్గెట్ అయ్యాయని.. అది కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ఆమె అన్నారు. ఇది పార్టీకి పెద్ద సమస్యగా మారిందని, చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడు కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండొచ్చని సూచించారు. అయితే ఎవరెవరికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయనేది కవిత వెల్లడించలేదు.
కవిత ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త సవాలుగా మారాయి. బీఆర్ఎస్ మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ తమ హయాంలో జరగలేదని వాదిస్తూ వస్తోంది. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయినా తమకు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని ఆ పార్టీ అగ్రనేతలు చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కవిత స్వయంగా ట్యాపింగ్ జరిగిందని, అందులో హరీశ్ రావు వంటి సీనియర్ నేతల పాత్ర ఉందని చెప్పడం సంచలనం కలిగించే విషయమే. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వంటి అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులు. ఇటీవల హరీశ్ రావు ఆఫీస్‌లో పనిచేసిన వ్యక్తి అరెస్టు కావడం, కవిత పీఏకు నోటీసులు జారీ కావడం వంటి పరిణామాలు జరిగాయి. ఇప్పుడు కవిత ఆరోపణలు వాటికి బలం చేకూర్చాయి.
ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. కుటుంబ విభేదాలు, అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ కేసులు.. ఇలా అన్నీ కేసీఆర్ కుటుంబానికి పెద్ద సవాల్ గా మారాయి. కవిత పోలీసుల ముందు సాక్ష్యం ఇస్తే, ఈ కేసు మరో మలుపు తీసుకోవచ్చు. ముఖ్యంగా కేటీఆర్ ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందని తేలితే దీని వెనుక కవిత చెప్పిన ఆ ముగ్గురి పాత్ర ఉందని నిర్ధారించే అవకాశం కలుగుతుంది. ఒకవేళ కేటీఆర్, కేసీఆర్ ఫోన్లు ట్యాప్ కాలేదంటే వాళ్లకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉందని భావించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కవిత ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరో టర్న్ తీసుకునేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.