Jubilee Hills ByElection: రేపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..! తాయిలాలు షురూ..!!
హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు (Jubilee Hills Assembly By Election) రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ (Polling) జరగనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారపర్వం ముగియడంతో తాయిలాలకు తెరలేపాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెండు భిన్న ధృవాల కలయిక అని చెప్పొచ్చు. ఒకవైపు సంపన్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు, మరోవైపు అధిక జనాభా కలిగిన బోరబండ, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్ వంటి బస్తీ ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 4 లక్షలకు పైగా ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో దాదాపు 30శాతం మంది మైనారిటీలున్నారు. బస్తీ వాసులు ఈ నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తి అని చెప్పొచ్చు. అందుకే వీళ్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ తమ శక్తికి మించి పని చేస్తున్నాయి.
అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చరిష్మా, తమ ఆరు గ్యారెంటీలను ప్రధానంగా ప్రచారం చేసింది. పాత ప్రభుత్వ వైఫల్యాలు, నియోజకవర్గ సమస్యలను ఎత్తిచూపుతూ స్థానిక నేత, యువకుడు అయిన నవీన్ యాదవ్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు, దివంగత ఎమ్మెల్యే సతీమణి మాగంటి సునీతను నిలబెట్టిన బీఆర్ఎస్ (BRS), సానుభూతిని ప్రధాన అస్త్రంగా వాడుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సుడిగాలి పర్యటనలు చేశారు. గత పదేళ్ల తమ అభివృద్ధి పనులను, ప్రభుత్వ అనుభవం లేమిని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రచారం ఆసాంతం ఇరు పార్టీల మధ్య వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు నడిచాయి, ముఖ్యంగా రౌడీ షీటర్ల అంశంపై మాటల తూటాలు పేలాయి. బీజేపీ కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి అగ్రనేతలతో ప్రచారం నిర్వహించినా, ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే కేంద్రీకృతమైంది.
సాధారణంగా తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే ఈ నియోజకవర్గంలో, ఈసారి ఉపఎన్నిక కావడంతో పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ పెంచడానికి అన్ని పార్టీలు ప్రత్యేక ప్రయత్నాలు చేశాయి. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బు, మద్యం వంటి ప్రలోభాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది.
ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు, బస్తీ వాసులు, దినసరి కూలీలు ఎటువైపు మొగ్గు చూపుతారనే అంశంపైనే విజయం ఆధారపడి ఉంది. కాంగ్రెస్ తన గ్యారెంటీలను, బీఆర్ఎస్ సానుభూతి, స్థానికతను, పాత ప్రభుత్వ అభివృద్ధిని నమ్ముకున్నాయి. ఈ ఉపఎన్నిక ఫలితం, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలను, ముఖ్యంగా కాంగ్రెస్ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తేల్చనుంది.







