BJP Candidate: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు..!

తెలంగాణలో ఇప్పుడు అందరి చూపూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Byelection)పైనే ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. అయితే బీజేపీ (BJP) మాత్రం ఇంకా తేల్చలేదు. దీంతో బీజేపీ వెనకబడిందనే టాక్ నడుస్తోంది. అయితే… బీజేపీ తమ అభ్యర్థిపై నెలకొన్న సస్పెన్స్‌ను తెరదించేందుకు సిద్ధమైంది. సుదీర్ఘ అంతర్గత మంతనాలు, క్షేత్రస్థాయి నివేదికల పరిశీలించిన అనంతరం పార్టీ కేంద్ర నాయకత్వం లంకల దీపక్‌రెడ్డి ( Lankala Deepak Reddy) అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కీలక పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధిష్ఠానానికి సమర్పించిన జాబితాలో దీపక్‌రెడ్డితో పాటు పార్టీకి చెందిన ఇతర ప్రముఖులు కీర్తిరెడ్డి, పద్మ పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఆదివారం జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశంలో అభ్యర్థి ఎంపికపై లోతైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి బలం, ఇతర పార్టీల అభ్యర్థులకు దీటుగా నిలబడగలిగే సామర్థ్యం, సామాజిక సమీకరణాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన మాధవీలత పేరు సైతం ప్రస్తావనకు వచ్చినప్పటికీ, ప్రస్తుత ఉప ఎన్నికలో స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. అన్ని నివేదికలు, సిఫార్సులను పరిశీలించిన అనంతరం, అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్లమెంటరీ బోర్డు దీపక్‌రెడ్డి వైపే మొగ్గు చూపింది.
దీపక్‌రెడ్డి ఎంపిక కేవలం వ్యక్తిగత బలంపైనే కాకుండా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రత్యేక ఓటు బ్యాంక్ సమీకరణాలపై బీజేపీ చేసిన వ్యూహాత్మక అంచనాగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌లో లక్ష మందికి పైగా ఉన్న ముస్లిం ఓటర్లు విజయావకాశాలను ప్రభావితం చేయడంలో కీలకం. సాధారణంగా బీజేపీకి అందని ఈ ఓట్లను చీల్చడం లేదా కనీసం తటస్థంగా ఉంచడం ద్వారా బలమైన పోటీ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ముస్లిం ఓటర్లను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థి ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులు వేయడం దీపక్‌రెడ్డి ఎంపిక వెనుక ఒక కారణం. దీపక్‌రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న పట్టు, వివిధ వర్గాలతో ఉన్న బలమైన పరిచయాలు, ఇతర ప్రధాన పార్టీల నుంచి వచ్చే ఓట్లను కూడా తమ వైపు తిప్పుకోగలరనే నమ్మకం బీజేపీ అధిష్ఠానంలో ఉంది. ఉప ఎన్నికల్లో సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయడం కీలకం. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసిన తర్వాత, మిగిలిన పేర్లతో పోలిస్తే దీపక్‌రెడ్డిని నిలబెట్టడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పార్టీ నిర్ణయించింది.
అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే బీజేపీ జూబ్లీహిల్స్‌లో ప్రచారాన్ని ఉధృతం చేయనుంది. ముఖ్యంగా, జాతీయ నాయకత్వాన్ని ప్రచారానికి రప్పించడం ద్వారా స్థానిక ఎన్నికకు జాతీయ స్థాయి ప్రాధాన్యత కల్పించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఉప ఎన్నికను తెలంగాణలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఒక అవకాశంగా బీజేపీ చూస్తోంది. తమకు అర్బన్ ఓటు బ్యాంక్ కలిసొస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ఈ ఎన్నికలో సత్తా చాటడం ద్వారా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయాలని భావిస్తోంది. అందుకే కేడర్ మొత్తం ఈ ఉపఎన్నికపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.