తెలంగాణలో ఫెసిలిటీ సెంటర్ … జుబిలెంట్ గ్రూప్
తెలంగాణ లో ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జూబిలెంట్ గ్రూప్ ప్రకటించింది. బయో ఏషియా 2023 సదస్సు వేదికగా మంత్రి కేటీఆర్ తో జూబిలెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, కో చైర్మన్ హరి ఎస్ భార్టియా సమావేశమయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో జూబిలెంట్ గ్రూప్ ఒప్పందం చేసుకున్నది. అనంతరం కంపెనీ ఈ ప్రకటన చేసింది. జూబిలెంట్ భారతీయ గ్రూప్ ఫార్మాస్యూటికల్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ప్రొప్రైటరీ వంటి విభిన్న రంగాల్లో కొనసాగుతున్నది. నావెల్ డ్రగ్స్, లైఫ్ సైన్స్ ఇంగ్రీడియంట్స్, అగ్రి ప్రొడక్ట్స్, పెర్మార్మెన్స్ పాలిమర్స్, ఫుడ్ సర్వీస్, ఫుడ్, ఆటో, కన్సల్టింగ్ ఇన్ ఏరోస్పేస్, ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్‌లో జూబిలెంట్ గ్రూప్‌నకు నాలుగు ఫ్లాగ్షిప్ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రూప్‌లో 46 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫార్మారంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న జూబిలెంట్ గ్రూప్ త్వరలో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుండడం సంతోషకరమన్నారు. అనంతరం జూబిలెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు హరి ఎస్ భారతీయ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా మారిందని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్నేహపూర్వక ప్రభుత్వం ఉండడంతో హైదరాబాద్‌లో పలు ప్రముఖ వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.






