టై గ్లోబల్ శిఖరాగ్ర సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్ (టై) ప్రపంచ శిఖరాగ్ర సదస్సును తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అద్భుతాలను సృష్టిస్తోందని, యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు గమ్యస్థానంగా రూపుదిద్దుకొందని తెలిపారు. ప్రైవేట్ రాకెట్‌ను తొలిసారి అంతరిక్షంలోకి పంపిన అంకుర సంస్థ స్కై రూట్ హైదరాబాద్‌కు చెందినది కావడం తమకు గర్వకారణమని తెలిపారు. 50 విభాగాల్లో 6,500 అంకురాల నిర్వహణ ద్వారా దేశంలోనే తెలంగాణ ఆగ్రస్థానంలో ఉందన్నారు. పెట్టుబడులకు సురక్షిత, లాభాదాయక గమ్యస్థానంగా ఉన్న తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పెద్దఎత్తున సంస్థలు ముందుకు రావాలని కోరారు. తెలంగాణను అంకుర రాష్ట్రం పిలవడం గర్వంగా ఉంది. అంకురాల జినోమ్ నివేదిక 2022 ప్రకారం ప్రపంచ పర్యావరణ అనుకూల ప్రతిభా లభ్యత గల పది ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. బలమైన అంకుర వ్యవస్థ గల తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోంది. నీతి అయోగ్ ఆవిష్కరణ సూచి నివేదికలలో నాలుగో స్థానం పొందింది.
తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా యువ ఆవిష్కర్తలు తమ కలలనుసాకారం చేసుకునేందుకు వీలుగా టీహబ్, వీహబ్, టీవర్క్స్, టీఎస్ఐసీ వంటి సంస్థలను ఏర్పాటు చేసి ప్రోత్సాహిస్తోంది. అలాగే నవీన ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నాం. టీహబ్2 ద్వారా 20.1 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. టీహబ్ ద్వారా గత ఏడేళ్లలో 1100 మంది అంకుర్య వ్యవస్థాపకులకు సహకారాన్ని అందించాం. తెలంగాణను అత్యున్నత పనితీరు గల రాష్ట్రంగా కేంద్ర పరిశ్రమలల శాఖ గుర్తించింది. నవీన సాంకేతికతలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆవిష్కరణలు దేశాల అభివృద్ధిలో కీలకం కానున్నాయని తెలిపారు.






