Hyderabad: హైదరాబాద్ వైపు అంతర్జాతీయ కంపెనీల చూపు

దేశంలోని మెట్రో నగరాలు ఒక్కో రంగంలో కీలక హబ్‌లుగా ఉన్నాయి. బెంగళూరు ఐటీ, పరిశోధనాభివృద్ధికి, ముంబై బీఎఫ్‌ఎస్‌ఐకి, హైదరాబాద్ ఫార్మా, ఐటీ, కృత్రిమ మేధస్సుకు, పుణె ఇంజనీరింగ్‌కు, ఢిల్లీ, ఎన్‌సీఆర్ ఈ కామర్స్, చెన్నై తయారీ రంగాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఖర్చును ఆదా చేసే కేంద్రాల నుంచి ఆవిష్కరణ, విలువ ఆధారిత సేవలకు వ్యూహాత్మక కేంద్రాలుగా అవి రూపాంతరం చెందుతున్నాయి. జీసీసీలు అనేవి బహుళ జాతి సంస్థల ఆఫ్‌షోర్ యూనిట్లు. ఇవి ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలను ఏకీకృతం చేసి కేంద్రాలు. దేశంలో కృత్రిమ మేధస్సు(ఏఐ), మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో జీసీసీల ఏర్పాటుకు అమెరికాకు చెందిన కంపెనీలే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. 2021 నుంచి ఇండియాలో జరిగిన జీసీసీ లీజులలో యూఎస్ కంపెనీల వాటా ఏకంగా 70 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఫార్చ్యూన్ 500 కంపెనీలు, గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఈ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఇతర దేశాల్లోని ప్రతిభావంతుల సేవలను, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోవడానికి ఎంఎన్‌సీ కంపెనీలు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేస్తాయి. వాటినే గ్లో బల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)గా పిలుస్తారు. ఆ కంపెనీలు తమ వ్యాపార వృద్ధికి ఈ కేంద్రాలలోని మానవ, సాంకేతిక వనరులను వినియోగించుకొంటాయి. హైదరాబాద్ కేంద్రం గా నడిచే జీసీసీలు దేశవ్యాప్తంగా స్టార్టప్ కల్చర్‌కు దశ, దిశను చూపుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. దేశంలో జీసీసీల లిస్టులో చూస్తే బెంగళూరు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న చెన్నై కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఫార్మా, బయోటెక్ రంగాల్లో కార్యకలాపాలు సాగించే కంపెనీలకు హైదరాబాద్ మొదటి ఎంపికగా నిలుస్తుందని రిపోర్టుల్లో తెలిసింది.
ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను (GCC) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి క్యూకట్టాయి. జీసీసీలను ఆకర్షించడంలో ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరును తోసిరాజని హైదరాబాద్ ముందువరుసలో నిలిచిందంటే కేసీఆర్ ప్రభుత్వం వేసిన అప్పటి ‘ఐటీ’ పునాదులేనని చెప్పకతప్పదు. గ్లోబల్ టెక్ కంపెనీలను ఏర్పాటు చేయడమే కాదు సుశిక్షితులైన ఉద్యోగులను కూడా అందిస్తూ మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించడంలో హైదరాబాద్ దేశానికే దిక్సూచీగా నిలిచింది. అందుకే గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు కేంద్ర బిందువుగా హైదరాబాద్ మారింది. దేశవ్యాప్తంగా రెండు వేల జీసీసీ ఎకో సిస్టమ్‌లుండగా.. హైదరాబాద్‌లోనే 355 జీసీసీలున్నాయి. దేశంలో కొత్తగా ప్రారంభించే ప్రతీ 100 జీసీసీల్లో 18 సెంటర్లు హైదరాబాద్‌లోనే కొలువుదీరుతున్నాయి. తద్వారా దేశంలో అత్యధికంగా జీసీసీ సెంటర్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. హైదరాబాద్‌లోని మొత్తం జీసీసీల్లో 3 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వచ్చే ఐదు నుంచి ఏడేండ్ల కాలంలో 35-40 శాతం కొత్త జీసీసీలు మన దేశంలో ప్రారంభం కానున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. వాటన్నింటికీ గమ్యస్థానం హైదరాబాద్ కాబోతున్నట్టు పారిశ్రామిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ, రీసెర్చ్, ఫైనాన్స్, కస్టమర్ సేవల కోసం ఎంఎన్‌సీలు హైదరాబాద్‌లో ఇప్పటికే వందలాది జీసీసీలను ఏర్పాటు చేశాయి.
టెక్ కంపెనీలు కూడా తమ వ్యాపార విస్తరణకోసం జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)లు ఏర్పాటు చేస్త్తున్నాయి. ప్రతి సంవత్సరం 100 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు అంటే భారత దేశ కరెన్సీలో సుమారు రూ.860 కోట్ల నుంచి రూ.8600 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న మధ్య స్థాయి టెక్ కంపెనీలు ఏర్పాటు చేస్తోన్న జీసీసీ కేంద్రాలను మధ్య స్థాయి మార్కెట్ జీసీసీలుగా చెబుతారు. ఈ జీజీసీలు టెక్నాలజీ పరిశ్రమ విస్తరణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు నాస్‌కామ్- జిన్నోవా రిపోర్ట్ తెలిపింది. అందులో చాలా కంపెనీలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని జిసిసి సెంటర్లను ప్రారంభించాయి. మధ్య స్థాయి టెక్ కంపెనీల జీసీసీల్లో హైదరాబాద్ నగరం జోరు కనబరుస్తోంది. భాగ్యనగరంతో పాటు బెంగళూరు, ఢల్లీి ఎన్‌సీఆర్, చెన్నై నగరాల్లో జీసీసీ కేంద్రాలు అధికంగా ఏర్పాటవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జీసీసీల్లో 74 శాతం మేర ఈ నగరాలకే వస్తున్నాయని ఓ నివేదిక తెలిపింది. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో టెక్నాలజీ నిపుణుల లభ్యత అధికంగా ఉంటుంది. టాలెంట్ హాట్‌స్పాట్లుగా ఈ రెండు నగరాలు మారుతున్నాయి. ఈ క్రమంలో కొత్త జీసీసీ కేంద్రాలను ఈ రెండు నగరాలు ఎక్కువగా ఆకర్షించగలగుతున్నట్లు రిపోర్ట్ తెలిపింది. టెక్నికల్ నాలెడ్జ్ గల మానవ వనరుల లభ్యత అధికంగా ఉండడం, బలమైన అంకుర సంస్థల వ్యవస్థ, అందుకు ప్రభుత్వ మద్దతు.. భారత్ వైపు ఆ సంస్థలు చూసేందుకు కీలకమైన అంశాలుగా తెలుస్తోంది. ఇన్ని సౌలభ్యాలు ఉన్నందునే బహుళ జాతి కంపెనీలు కొత్త జీసీసీలను భారత్‌లో అధికంగా స్థాపిస్తున్నాయని అంటున్నారు.
జీసీసీలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఇటీవల హైదరాబాద్ కేంద్రం గా నాసామ్ జీసీసీ కాన్‌క్లేవ్-2022ను సైతం నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ చాలా అనుకూలంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఇతర నగరాలతో పోల్చితే ఇక్కడున్న మౌలిక సదుపాయాలు అసమానమైనవిగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచైనా, నగరంలోని ఏదైనా ప్రధాన ప్రాంతాల నుంచైనా.. ఐటీ కారిడార్‌లోని గమ్యస్థానానికి గంటలోపు చేరుకో వచ్చు. దీనికితోడు నగరంలో 69 కిలోమీటర్ల మెట్రో రైలు కనెక్టివిటీ ఉన్నది. ఫ్లై ఓవర్ల నిర్మాణాల వల్ల ట్రాఫిక్ కు పెద్దగా ఇబ్బంది లేదు. ఇవన్నీ గమనించే పెద్ద పెద్ద సంస్థలు తమ జీసీసి ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. ఇక భద్రతపరంగా నగరంలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఉన్నది. ఇది ఐటీ కారిడార్‌లలో కంపెనీలకు భద్రత, ప్రత్యేకంగా మహిళల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నది. పోలీసు శాఖ-ఐటీ పరిశ్రమల మధ్య దీన్ని ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి
మెక్ డొనాల్డ్స్
అమెరికాకు చెందిన మెక్‌డొనాల్డ్స్ సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రం (జీసీసీ) ఏర్పాటు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జీసీసీ విభాగం చైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెస్స్కెతోపాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. 2000 మంది ఉద్యోగులతో మెక్‌డొనాల్డ్స్ ఇండియా సంస్థ గ్లోబల్ ఆఫీసును నెలకొల్పనుంది. ఈ కేంద్రాన్ని తమతమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీపడినప్పటికీ. మెక్‌డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొంటూ, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమున్న ఉద్యోగులను నియమించుకు నేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వర్సిటీని స్కిల్ జోన్‌గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్‌లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్‌లెట్లలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
హెచ్‌సిఎ హెల్త్ కేర్
అమెరికాకు చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ హెచ్‌సిఎ హెల్త్‌కేర్.. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఒక భారీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను ప్రారంభించింది. సత్వా నాలెడ్జ్ పార్క్‌లో 4,00,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్న ఈ సంస్థ 2026 నాటికి 3,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ విస్తరణ హైదరాబాద్‌ను ప్రపంచ ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ జిసిసిలకు ఒక ముఖ్య కేంద్రంగా నిలబెడుతోంది. ఇప్పటికే యునైటెడ్ హెల్త్ గ్రూప్, నోవార్టిస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. హెచ్ సి ఎ హెల్త్‌కేర్ రాకతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ జీవశాస్త్ర రంగంలో తన ప్రాధాన్యతను మరింత బలపరుచుకుంటోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. దేశంలోని తొలి హెల్త్‌కేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ హెచ్‌సిఎ హెల్త్ కేర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు ఆరోగ్యరంగంలో కూడా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటోందని అన్నారు. హాస్పిటాలిటీ రంగంలో ప్రారంభించిన జీసీసీ తరువాత.. హెల్త్‌కేర్‌లో ఇలాంటిది మొదటిసారిగా హైదరాబాద్‌లో ఏర్పడటం గర్వకారణమని పేర్కొన్నారు.
హెచ్ సి ఎ హెల్త్‌కేర్ వంటి అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఈ క్రమంలో సంస్థల సహకారాన్ని స్వాగతిస్తామని తెలిపారు. హైదరాబాద్ భవిష్యత్తులో ప్రపంచ ఆరోగ్య సేవల ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.హైటెక్ సిటీలోని సత్వా నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటైన ఈ కేంద్రం అమెరికా, యూకేలోని 192 ఆసుపత్రులు, 2500కిపైగా క్లినిక్స్‌కి సంబంధిత కార్యకలాపాలను నిర్వహించనుంది. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన ఈ జీసీసీపై రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్ వెల్లడిరచారు. . హెచ్‌సీఏ హెల్త్‌కేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అతుల్ కపూర్ మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా ఆరోగ్య సేవలు మరింత విస్తృతం కావడంతో పాటు, నాణ్యత కూడా పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, లైఫ్‌సైన్సెస్ బోర్డు ఛైర్మన్ శక్తి నాగప్పన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎవర్ నార్త్
నూతన ఆవిష్కరణలకు ప్రపంచ గమ్య స్థానంగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిర పర్చుకుంటోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. హైటెక్ సిటీలోని సత్త్వ నాలెడ్జ్ పార్కులో ఎవర్‌నార్త్ ఆరోగ్య సేవల సంస్థ ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి గ్లోబల్ సామర్థ కేంద్రాన్ని(జిసిసి) ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. మొదటి దశలో ఎవర్ నార్త్ 1,000 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఆధునిక కేంద్రం హైదరాబాద్‌లోని నిపుణుల సామర్థ్యాన్ని వినియోగించుకుని ఆరోగ్యరంగంలో ఐటీ వినియోగాన్ని మరింత విస్తృతపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరులోని సిగ్నా హెల్త్ సొల్యూషన్స్ సంస్థ, అంతర్జాతీయ ఆరోగ్య వ్యాపారానికి డేటా, అనలిటిక్స్, లాంటి సాంకేతిక సేవలను అందించే కేంద్రంగా ఎవర్ నార్త్ పనిచేస్తుందని ఆయన వివరించారు. సిగ్నా సంయుక్త భాగస్వామ్యం ద్వారా ఎవర్ నార్త్ 1.9 కోట్ల భారతీయులకు ఆరోగ్య సేవలను అందిస్తోంది. 75,000 మంది ఉద్యోగులు, 30కి పైగా దేశాల్లో 18.6 కోట్ల వినియోగదారులతో, ఆరోగ్య సేవల రంగంలో నూతన ఆవిష్కరణలకు, ఇంటెలిజెన్స్‌కు దోహదం చేస్తోందని శ్రీధర్ బాబు వెల్లడిరచారు. ఎవర్ నార్త్ జిసిసి కేంద్రం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల పరోక్షంగా కూడా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిగ్నా గ్రూప్ ప్రధాన సమాచార అధికారి నోయెల్ ఎడర్, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
వాన్‌గార్డ్
ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న పెట్టుబడుల నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్‌గార్డ్ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను(జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు ఈ విషయం తెలియజేశారు. ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌లో జీసీసీని ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ వెల్లడిరచింది. వచ్చే నాలుగేళ్లలో దాంట్లో 2,300 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇన్నోవేషన్ హబ్‌గా పని చేసే ఈ కేంద్రంలో.. కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ రంగాలకు చెందిన ఇంజనీర్లను సత్వరమే నియమించుకోవాలని యోచిస్తోంది. కాగా.. సీఎంను కలిసిన వాన్‌గార్డ్ ప్రతినిధుల బృందంలో ఆ సంస్థ సీఈవో సలీం రాంజీ, ఐటీ డివిజన్ సీఐవో, ఎండీ నితిన్ టాండన్, చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్, జీసీసీ-వాన్‌గార్డ్ ఇండియా హెడ్ వెంకటేశ్ నటరాజన్ ఉన్నారు. హైదరాబాద్‌లో వైవిధ్యమైన ప్రతిభ అందుబాటులో ఉందని.. ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం కూడా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహాయసహకారాలు కూడా బాగున్నాయని సలీం రాంజీ ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ను తమకు అనువైన చోటుగా ఎంచుకున్నామన్నారు. వాన్‌గార్డ్ సంస్థ హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ జీసీసీ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. జీసీసీ ఏర్పాటుకు.. ప్రభుత్వం తరపున తగిన సహకారాన్ని అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.
నెమెట్షెక్ గ్రూప్
ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, నిర్మాణ, ఆపరేషన్స్ (ఏఈసీ/ఓ) రంగానికి సేవలందిస్తున్న జర్మనీ కంపెనీ నెమెచెక్ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) ఏర్పాటు చేసింది. ఆధునిక జీవనంలో బహుళ అంతస్తుల భవనాలు, ఆస్పత్రులు, కంపెనీల్లో భవన సమాచార నిర్వహణ (బీఏఎం) వ్యవస్థ ప్రాధాన్యత పెరిగిందని, ఆయా సంస్థలకు తాము బీఏఎం సాఫ్ట్‌వేర్ అందిస్తామని నెమెచెక్ గ్రూప్ చీఫ్‌ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ పండిత తెలిపారు.
ఎంటైన్
అతిపెద్ద స్పోర్ట్స్ బెట్టింగ్, గేమింగ్ గ్రూపు అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎంటైన్ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. 2 వేల సీటింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌కు సంబంధించి కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ నూతన సెంటర్‌లో 3,400 మంది ప్రతిభ కలిగిన ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా 3,400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని కంపెనీ ఎండీ అంథిల్ అన్భజగన్ చెప్పారు. తమ అంతర్జాతీయ కస్టమర్లకు అవసరమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సేవల్లో 85 శాతం ఈ జీసీసీ నుంచే అందిస్తామన్నారు. ఎంటైన్ గ్రూప్ ఇప్పటి వరకు మన దేశం నుంచి ఐవీ పేరుతో కార్యకలాపాలు నిర్వహించింది. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచు కుని భారత అనుబంధ సంస్థ పేరును కూడా ఎంటైన్ ఇండియాగా మార్చినట్టు అన్భజగన్ చెప్పారు.
మోడ్‌మెడ్
అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థ మోడ్‌మెడ్ హైదరాబాద్‌లో తన తొలి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్(జీసీసీ)ను ప్రారంభించింది. మెడికల్ స్పెషాల్టీ సేవలను అన్నింటిని ఒక్కతాటిపైకి తేవడంలో భాగంగా 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో డానియల్ కేన్ తెలిపారు.
దైచీ లైఫ్
జపాన్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ బీమా కంపెనీ దైచీ లైఫ్ గ్రూప్ కూడా హైదరాబాద్ కు వచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ, కన్సల్టెన్సీ దిగ్గజం క్యాప్‌జెమినీ.. దైచీ లైఫ్ గ్రూప్ కోసం బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) పద్దతిలో జిసిసి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయంగా తన సేవల డిజిటల్ మార్పునకు ఈ జీసీసీ ఉపయోగపడుతుందని దైచీ లైఫ్ భావిస్తోంది. తన సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్, మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ (ఏఐ), డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ సేవల విస్తృతికి ఈ జీసీసీ నుంచి పనిచేసే ఐటీ, వృత్తి నిపుణులు దోహదం చేస్తారని భావిస్తున్నట్టు దైచీ లైఫ్ తెలిపింది. దైచీ లైఫ్‌కు జపాన్ వెలుపల ఇదే తొలి కేంద్రం. ప్రారంభంలో ఈ జీసీసీ కేంద్రం సేవలు జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు మాత్రమే పరిమితం. మార్కెట్ అవకాశాలు, డిమాండ్‌ను బట్టి హైదరాబాద్ జీసీసీ సేవలను ఇతర దేశాలకు విస్తరిస్తామని దైచీ లైఫ్ తెలిపింది. జీసీసీల ద్వారా భిన్నమైన అంతర్గత సామర్ధ్యాలు పెంచుకోవాలన్న లక్ష్యానికి క్యాప్‌జెమినీతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం దోహదం చేస్తుందని దైచీ లైఫ్ గ్రూప్ సీఈఓ, ప్రెసిడెంట్ టెట్సుయ కికుట ఒక ప్రకటనలో తెలిపారు. టెక్నాలజీ, నవకల్పనల మేళవింపు ద్వారా ఖాతాదారులు ఆశించిన దానికంటే ఎక్కువ సంతృప్తిని ఈ జీసీసీ ద్వారా అందిస్తామని క్యాప్‌జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్ తెలిపారు.
డిఎజడ్‌ఎన్
ప్రపంచంలోని ప్రముఖ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన డిఎజడ్‌ఎన్ హైదరాబాద్‌లో తన మొట్టమొదటి స్పోర్ట్స్ టెక్నాలజీ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. స్పోర్ట్స్ టెక్ రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా సంస్థగా పేరొందిన డిఎజడ్‌ఎన్ దేశంలో తన మొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను హైదరాబాద్‌లో ప్రారంభించడం విశేషం. సంస్థ ప్రతినిధులు సందీప్ టికూ, వీర్ దామరాజు, గోమతి శంకర్, ప్రవీణ్ మార్ల తదితరుల సమక్షంలో జీసీసీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. డిఎజడ్‌ఎన్ అతిపెద్ద గ్లోబల్ ఆపరేషన్స్ హబ్‌గా ఈ జీసీసీ మారనుంది. 2026 చివరి నాటికి సుమారు 3,000 మంది నిపుణులను నియమించనుంది. రాబోయే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడితో.. హైదరాబాద్ కేంద్రంగా భారత్‌లో విస్తరణకు తొలిఅడుగు వేసింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఇంజినీరింగ్, ఉత్పత్తి ఆవిష్కరణలను విస్తరించడం.. ఆధునాతన ఏఐ, రియల్‌టైమ్ ఎనలటిక్స్ ప్లాట్‌ఫారాలను నిర్మించడం.. నైపుణ్య, పరిశోధనల్లో ఉపాధి అవకాశాలను కల్పించడం.. విద్యాసంస్థలతో భాగస్వామ్యమవడం తదితర కార్యక్రమాల ద్వారా స్పోర్ట్స్ టెక్నాలజీ అభివృద్ధికి ఈ జీసీసీ తోడ్పాటును అందిస్తుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు ఐసీసీసీలో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో 9 వేల కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎలి లిల్లీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఎలి లిల్లీ సంస్థను ముఖ్యమంత్రి అభినందించారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని.. పరిశ్రమలు పెట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని అన్నారు. 1965లో ఇందిరా గాంధీ హైదరాబాద్‌కు ఐడీపీఎల్ తీసుకురావడంతో ఫార్మా హబ్‌గా మారిందన్నారు. హైదరాబాద్‌లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయన్నారు.