Revanth Reddy: కాంగ్రెస్ గెలిస్తే క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డిదే!
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్థానాన్ని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee hills ByElection) తేల్చబోతోంది. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే కాదు.. రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ఆయన పాలనకు, వ్యూహాలకు అద్దం పట్టే ప్రతిష్టాత్మక అగ్నిపరీక్ష. అయితే ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అన్నీ కాంగ్రెస్ (Congress) గెలుపు ఖాయమని చెప్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డికి తిరుగులేకపోవచ్చు. జూబ్లీహిల్స్ గెలుపు క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం విభిన్న వర్గాల సమూహం. ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నికలో ఓటమిపాలైతే, అది రేవంత్ రెడ్డి హవాకు, ఆయన ప్రతిష్ఠకు పెద్ద బ్రేక్ పడినట్లే అవుతుంది. హైకమాండ్ ముందు, రాష్ట్రంలోనూ తన పనైపోయిందనే ప్రచారం మొదలవుతుందని గ్రహించిన రేవంత్, ఈ సీటును డూ ఆర్ డై అన్నట్లుగా తీసుకున్నారు. అందుకే ఆయన అత్యంత పదునైన, దూకుడుతో కూడిన వ్యూహాలను అమలు చేశారు.
మొదట్లో కాంగ్రెస్ వెనుకబడిందనే సంకేతాలు వచ్చినా, రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాక ప్రచారం రూపురేఖలు మారిపోయాయి. ఆయన అమలు చేసిన వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కలేదు. ముఖ్యంగా నియోజకవర్గాన్ని ఆయన పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకుని కేడర్ మొత్తాన్ని మోహరించారు. ఆయన చేసిన మైక్రే మేనేజ్మెంట్ బాగా వర్కవుట్ అయిందని అర్థమవుతోంది. ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా నియమించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ నియోజకవర్గంలో మోహరించి, పకడ్బందీ పర్యవేక్షణ ఉండేలా చూశారు. జూబ్లీహిల్స్లో ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువ. అందుకే వ్యూహాత్మకంగా ఎంఐఎం (MIM) మద్దతు కూడగట్టారు. దీనికి కొనసాగింపుగా, ముస్లిం మైనారిటీ నేత అజారుద్దీన్ను ఆగమేఘాలపై కేబినెట్లోకి తీసుకున్నారు. ఇది ఆ వర్గం ఓటర్లలో కాంగ్రెస్ పట్ల సానుకూలతను పెంచింది.
నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించడానికి రేవంత్ కట్టుదిట్టమైన వ్యూహం పన్నారు. టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దింపి, వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. తద్వారా తెలుగుదేశం మద్దతుదారులను కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు కృషి చేశారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లో సినీ పరిశ్రమకు చెందిన కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిని ఆకర్షించేందుకు ప్రత్యేకంగా వారితో సమావేశమయ్యారు. సినీ కార్మికులకోసం ప్రత్యేక వరాలు, పథకాలు ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ దే విజయం అని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఆ క్రెడిట్ అంతా ఏకపక్షంగా రేవంత్ రెడ్డికే దక్కుతుంది. హైకమాండ్ దృష్టిలో ఆయన స్థానం మరింత పటిష్టమవుతుంది. రాష్ట్ర నాయకత్వంపై ఆయన పట్టు మరింత బలపడుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన హవా, నిర్ణయాలపై విమర్శించే వారికి బలమైన సమాధానం ఇచ్చినట్లు అవుతుంది. సిట్టింగ్ స్థానంలో ఓడిపోవడం బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఆ పార్టీ నాయకులలో నిరాశ పెరగడం అనివార్యం. కేసీఆర్ నాయకత్వంపై మరిన్ని సందేహాలు తలెత్తవచ్చు.
మొత్తంగా ఈ ఉపఎన్నిక రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం. ప్రతిష్టాత్మకమైన ఈ పోరాటంలో ఆయన అనుసరించిన సంక్లిష్టమైన, వ్యూహాత్మక విధానాలు వర్కవుట్ అయినట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ విజయం సాధిస్తే, అది కేవలం ఓ సీటు గెలవడం కాదు. రేవంత్ రెడ్డి హవా మరింత పెరగడానికి నాంది పలుకుతుంది.







