Etala : యాచించే స్థాయిలో కాదు… శాసించే స్థాయిలో ఉన్నాం : ఈటల

బీసీ రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) విమర్శించారు. జూబ్లీ బస్ స్టేషన్ (Jubilee Bus Station) వద్ద నిర్వహించిన బీసీ బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తమిళనాడు (Tamil Nadu) ఒక్కటి మాత్రమే నిజాయతీగా రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఒక సారి సర్వే చేశారని, బీసీ కమిషన్ కూడా వేశారని తెలిపారు. కానీ నిజాయతీ లేక అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేసింది తప్ప నిజాయతీ లేదన్నారు. బీసీలు 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెబుతున్నారు. నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకొంటా. బీసీలం మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు, శాసించే స్థాయిలో ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుంది. కుటుంబమే ఏలుతుంది. కాంగ్రెస్ (Congress) జాతీయ పార్టీ అయినా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ, ఒక ట్రైబుల్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి. కానీ ముగ్గురున్నారు. ఉన్న వారికి ఇచ్చిన శాఖలు చిన్నవి అని అన్నారు.
నామినేటెడ్ పోస్టుల్లో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తా అని ప్రధాని మోదీ ప్రకటించారు. మోదీ క్యాబినెట్‌లో 27 మంది ఓబీసీలు మంత్రులు ఉన్నారు. బీజేపీ నిజాయతీని ఎవరు శంకించలేరు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు, చట్టసభల్లో కూడా వచ్చే వరకు ఆగదు. మాది యాచన కాదు. పాలించే శక్తి మాకు ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యం అయిందో, బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యం అవుతుంది. ఆశయాన్ని ముద్డాడే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దాం అని పిలుపునిచ్చారు.