గ్లోబల్ ఎఐ క్యాపిటల్‌గా హైదరాబాద్

తెలంగాణ అభివృద్ధిలో, పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని, పుట్టిన ఊరుకు మేలు చేసే విధంగా తమ తమ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలి. ఇలా వచ్చే ప్రవాస భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. త్వరలో తెలంగాణ ప్రవాసీయులకోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాము. అలాగే హైదరాబాద్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీ కేంద్రాల ఏర్పాటుకు, విస్తరణకు ప్రభుత్వం తరపున కృషి చేస్తున్నాము.
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని నిర్మించే మా ప్రయాణంలో ప్రవాస భారతీయులు ముందుకు రావాలి. లైఫ్ సైన్సెస్ రంగంపై మా ప్రభుత్వం వ్యూహాత్మక దృష్టిని ఇప్పటికే సారించింది. అలాగే లైఫ్ సైన్సెస్‌తోపాటు బయోటెక్ రంగాన్ని కూడా ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి అనేక చర్యలను చేపడుతున్నాము.
ప్రభుత్వ పరిపాలన, పారిశ్రామిక రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగానికి అనుసరించాల్సిన విధానాలపై కూడా కార్యాచరణ ప్రణాళిక (రోడ్ మ్యాప్) రూపొందిస్తున్నాము.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఈవెంట్ 2024 సెప్టెంబర్ 5 నుండి 6 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎఐ నిపుణులు, కంపెనీలతోపాటు ఐటీ నిపుణులకు ఈ సమ్మిట్ వేదిక కానున్నది. హైదరాబాద్‌ను గ్లోబల్ ఎఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాము. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కోసం 200 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్, మీడియం ఎంటైర్‌ప్రైజెస-ఎంఎసఎంఈ పాలసీ)కు సంబంధించి కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. అందులో మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నాము.
ఇలా తెలంగాణను అన్నీ రంగాల్లోనూ అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తూనే మరోవైపు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. తెలంగాణ అభివృద్ధిలో అమెరికాలోని ఎన్నారైలు పాల్గొని తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాను.
దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి