హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు

గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మాణ రంగం దూసుకుపోతున్నది. గత సంవత్సరం ఇళ్ల విక్రయాల్లో దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణాల్లో దాదాపు సగం మేర జీహెచ్‌ఎంసీ పరిధిలోనే జరిగి అనుమతుల్లో కూడా జోరును చూపించింది. ఆకాశమే హద్దుగా ఆకాశహర్మ్యాలు హైదరాబాద్ నగర అందాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే 2022లో కొత్తగా 16,114 నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ మంజూరు చేయగా, వీటి నుంచి రూ.1056.37 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. నిర్మాణ రంగ అనుమతుల్లో భాగంగా 30 అంతస్తులకు మించి 14 హైరైజ్డ్ బిల్డింగ్‌లు ఉండడం గమనార్హం. అత్యధికంగా వెస్ట్‌జోన్ (శేరిలింగంపల్లి)లో అనుమతులు ఇచ్చారు. 60 హైరైజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ రాగా, 22 హై రైజ్డ్ కమర్షియల్ బిల్డింగ్‌లు వచ్చాయి. వీటికి తోడుగా 16 చోట్ల గేటెడ్ కమ్యూనిటీ లే అవుట్లకు అనుమతులు ఇచ్చారు. శేరిలింగంపల్లి జోన్‌లో గ్రౌండ్ 47 అంతస్తుల నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
నిర్మాణ అనుమతులన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీపాస్‌తో నిర్మాణ రంగ అనుమతులు సులభతరం అయ్యాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. 75 గజాల్లోపు ఇండ్లకు రూ.1కే నిమిషాల్లో ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్‌తో అనుమతి పొందుతున్నారు. 1921 దరఖాస్తులు రిజిస్ట్రర్ కాగా, 716 మాత్రమే ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్‌కు అర్హత సాధించాయి. 993 దరఖాస్తులను తిరస్కరించారు. ప్రధానంగా 75 నుంచి 500 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందుతున్నా రు. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, భవనం ప్లాన్ తదితర వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వెంటనే వీరికి ఆమోదం (ఇన్‌స్టంట్ అఫ్రూవల్) లభిస్తుంది. 500 చదరపు మీటర్ల కంటే ఎకువ ప్లాట్ ఏరియా, లేదా 10 మీటర్ల కంటే ఎకువ ఎత్తు ఉన్న అన్ని నివాస భవనాలు, అన్ని నివాసేతర భవనాలు (ఎత్తైన భవనాలు, సమూహ అభివృద్ధి పథకాలు, అపార్ట్‌మెంట్ సముదాయాలు, మల్టీప్లెక్స్‌లు, నివాసేతర భవనాలు), లేఅవుట్లకు 21 రోజుల వ్యవధిలో అనుమతులు ఇస్తున్నారు.
ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ, లింకు రోడ్లు, అభివృద్ధి ఏదైనా ఒక్క భూసేకరణకే ఏళ్ల తరబడి సమయం పట్టేది. కానీ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందే తడవుగా మాసాల వ్యవధిలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసుకొని అభివృద్ధికి బాటలు వేస్తున్నది. దీనికి 2017 సంవత్సరంలో మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన ‘టీడీఆర్’ పాలసీ. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాలకై చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా ఇచ్చే నగదు నష్ట పరిహారానికి బదులుగా ప్రవేశపెట్టిన ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్)లో సత్తా చాటుతున్నది. 2017 నుంచి డిసెంబరు 30, 2022 నాటికి దాదాపు 4వేల కోట్ల విలువైన 1788 టీడీఆర్‌లను అందజేసింది. ఒక్క ఈ ఏడాదిలోనే 483 టీడీఆర్ సర్టిఫికెట్లను అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు
గృహ విక్రయాలు, ప్రారంభాలలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. కరోనా, గృహాల ధరలు, వడ్డీ రేట్లు పెరుగుదల ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు జరిగాయి. గతేడాది 47,487 అమ్మకాలు, 68 వేల యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2021తో పోలిస్తే విక్రయాలలో 87 శాతం వృద్ధి రేటుతో నగరం తొలిస్థానంలో నిలిచింది. 2021లో హైదరాబాద్‌లో 25,406 గృహాలు అమ్ముడుపోగా.. 2022లో దేశంలోని ఏ నగరంలో లేనివిధంగా రికార్డు స్థాయిలో 87 శాతం వృద్ధి రేటు నమోదయింది. 2022లో విక్రయాలలో తొలి స్థానంలో నిలిచిన ముంబైలో 44 శాతం మాత్రమే వృద్ధి కాగా.. ఎన్‌సీఆర్‌లో 59 శాతం, బెంగళూరులో 50%, పుణేలో 59 శాతం, చెన్నైలో 29 శాతం, కోల్‌కత్తా లో 62 శాతం వృద్ధి నమోదయింది. గతేడాది హైదరాబాద్‌లో 51,500 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఈ ఏడాది 32% పెరుగుదల కనిపించిం దని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడిరచింది. దేశంలో గతేడాది 3,57,600 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2021లో 2,36,700 గృహాలు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో 51 శాతం వృద్ధి. అయితే 2014తో పోలిస్తే మాత్రం 2022లో లాంచింగ్‌లు తక్కువే. 2014లో 5.45 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి. లాంచింగ్స్‌లో ముంబై, హైదరాబాద్ పోటీపడ్డాయి. ఈ రెండు నగరాల వాటా 54 శాతంగా ఉంది.