Harish Rao: మే20న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: హరీష్ రావు

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న జరగనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నేత, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు (Harish Rao) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సిద్దిపేటలో కార్మిక సంఘాలు నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని ఆయన మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మొదటి నుండి కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన (Harish Rao) ఆరోపించారు. కార్మికులకు వ్యతిరేకంగా రూపొందించిన కార్మిక విధానాలను (లేబర్ కోడ్స్) కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో కనీసం ఆసుపత్రులలో కూడా అవసరమైన మందులు అందుబాటులో లేవని ఆరోపించారు. ఉద్యోగ భద్రత పథకం (ఈఎస్‌ఐ) ఆసుపత్రుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆయన (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు.