Amaravathi: అమరావతి గడ్డపై తొలిసారి గణతంత్ర వేడుకలు.. రైతుల త్యాగానికి గౌరవం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ భూములను త్యాగం చేసిన వారు అమరావతి రైతులు (Amaravati Farmers). తరతరాలుగా అనుభవిస్తున్న భూములను రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇచ్చిన వారి త్యాగాల మీదనే అమరావతి (Amaravati)కి పునాది పడింది. వేలాది ఎకరాల భూములు సమర్పించడంతోనే నవ్యాంధ్ర రాజధాని ఆలోచన సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. మధ్యలో ప్రభుత్వం మారడంతో ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణానికి ఆటంకాలు ఎదురైనా, ఇప్పుడు మళ్లీ అమరావతిలో చలనం కనిపిస్తోంది. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి, ఒక నిర్దిష్ట కాలపరిమితిలో కీలక భవనాలు పూర్తి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ పరిణామాల మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అమరావతి గడ్డపై గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగడం విశేషంగా మారింది. ఇది అమరావతికి మాత్రమే కాదు, భూములు ఇచ్చిన రైతులకు కూడా గర్వకారణంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో స్వాతంత్ర్య వేడుకలు ఒక్కో జిల్లాలో నిర్వహించగా, గణతంత్ర వేడుకలు విజయవాడ (Vijayawada) కేంద్రంగా జరుగుతూ వచ్చాయి. అయితే ఈసారి జనవరి 26న జరిగే వేడుకలు అమరావతిలో నిర్వహించనుండటంతో ఆ ప్రాంతమంతా ఉత్సాహంతో నిండిపోయింది.
ఈ వేడుకల కోసం అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్ (Seed Axis Road) సమీపంలో, మంత్రుల బంగళాల ఎదుట ప్రత్యేక పెరేడ్ గ్రౌండ్ (Parade Ground)ను సిద్ధం చేస్తున్నారు. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ వేదికను రూపొందించి, వీవీఐపీలు (VVIPs), వీఐపీలు (VIPs), ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు అసలైన అతిథులుగా భావిస్తున్న అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా మరో గ్యాలరీని సిద్ధం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ గణతంత్ర వేడుకలకు హాజరు కావాలని అమరావతి రైతులకు ఆహ్వానాలు పంపించడంతో, ప్రభుత్వం వారి త్యాగాలకు ఇస్తున్న గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది. రైతుల కోసం ప్రత్యేక వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయడం ద్వారా, రాజధాని నిర్మాణంలో వారి పాత్ర ఎంత కీలకమో మరోసారి గుర్తు చేస్తున్నట్టు ఉంది. అందుకే ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో అమరావతి రైతులే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారని భావిస్తున్నారు.
మొత్తంగా ఈ వేడుకలను తిలకించేందుకు సుమారు 13 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఆర్డీఏ (CRDA ) అధికారులు వెల్లడించారు. వీఐపీలు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపధ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా అమరావతిలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజకీయ, సామాజిక వాతావరణంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






