Harish Rao: తెలంగాణలో ఎమర్జెన్సీ తెచ్చారు.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎమర్జెన్సీ పాలన తెచ్చారని, అందాల పోటీలపై ఆయన పెట్టిన శ్రద్ధ యూరియా సరఫరాపై పెట్టలేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సిద్ధిపేట జిల్లా నంగునూరులో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమీక్ష చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ (KCR) రైతులకు అగ్ర తాంబూలం ఇచ్చారని, కానీ రేవంత్ రెడ్డి వారిని అతలాకుతలం చేశారని అన్నారు. కేసీఆర్ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) యూరియా కోసం రైతులను పోలీసుల కాళ్లు పట్టుకునేలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రిస్తోందని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, సగం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు. వడ్ల బోనస్ డబ్బులు కూడా ఇంకా ఇవ్వలేదని చెప్పారు. బడే భాయ్ నరేంద్ర మోడీ, చోటా భాయ్ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కలిసి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. వెంటనే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ, లేదంటే తమ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని హరీష్ రావు (Harish Rao) హెచ్చరించారు.