బయో ఏషియా 2023 విజయవంతం
హైదరాబాద్ వేదికగా మూడ్రోజులపాటు ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు జరిగిన బయోఏషియా-2023 సదస్సు విజయవంతమైంది. ఈ లైఫ్ సైన్సెస్ సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. దేశ విదేశాల నుంచి దాదాపుగా 5,600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 50కి పైగా దేశాల నుంచి దిగ్గజ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి.
తొలిరోజు జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు మాట్లాడుతూ, లైఫ్‌సైన్సెస్ (జీవశాస్త్రాలు) పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఈ రంగంలో తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్‌గా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో తయారీ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని, 2030 నాటికి రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్ రంగం విలువ 250 బిలియన్ డాలర్లు దాటుతుందని పేర్కొన్నారు. బయో ఏషియా సదస్సు తెలంగాణతోపాటు భారతదేశంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడిరదని అన్నారు. వందకుపైగా దేశాలకు చెందిన ఆరోగ్య సంరక్షణ, ఔషధ, జీవశాస్త్రాల రంగ అధిపతులను ఈ వేదిక ఒకే చోటికి చేరుస్తున్నదని తెలిపారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్-షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యుమనైజ్డ్ హెల్త్‌కేర్’ అనే థీమ్‌తో ఈ సదస్సు జరిగిందని మావవాళి శ్రేయస్సుకోసం సహకార స్ఫూర్తితో కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను వివరించేందుకు ఈ థీమ్‌ను ఎంపికచేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరస్పర సహకారం ఎంత ముఖ్యమో, ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉంటుందో కొవిడ్-19 మహమ్మారి నిరూపించిందని అన్నారు.
రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం విలువను ప్రస్తుతమున్న 50 బిలియన్ డాలర్ల నుంచి 2030నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచాలని గతంలో లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికీ, 2022లోనే 80 బిలియన్ డాలర్లకు చేరిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ సగటు వృద్ధి 14 శాతం ఉంటే, తెలంగాణలో 23 శాతం నమోదైందని, దీనిని బట్టి 2025 నాటికే తాము 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకొంటామని తెలిపారు. 2030 నాటికి తెలంగాణ లైఫ్‌సైన్సెస్ ఎకో సిస్టం విలువ 250 బిలియన్ డాలర్లు దాటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గడచిన ఏడేండ్లలో తెలంగాణ మూడు బిలియన్ డాలర్లకంటే ఎక్కువ నికర కొత్త పెట్టుబడులను ఆకర్షించిందని, తద్వారా 4.5 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టించామని వెల్లడించారు. ఆర్ అండ్ డీతోపాటు సాంకేతిక భాగస్వాములైన అరగెన్, సాయి, సింజెన్, డెలాయిట్,యాక్సెంచర్, టెక్ మహీంద్రా వంటి అనేక సంస్థల సహకారంతో ఇది సాధ్యమైంది. ప్రపంచంలోని టాప్-10 ఇన్నోవేటర్ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇవి కోర్ ఆర్ అండ్ డీ, డిజిటల్, ఇంజినీరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి సేవలు ప్రపంచవ్యాప్తంగా రోగుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన చికిత్సలు, వైద్య పరికరాలను సరసమైన ధరకే అందుబాటులోకి తెచ్చేందుకు దోహదం చేస్తున్నాయి’ అని వివరించారు.
నొవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్ కీలకోపన్యాసం చేస్తూ, తెలంగాణలో నైపుణ్యంగల సిబ్బందికి కొదవలేదని, తమ విజయం వెనుక తమ ఉద్యోగులదే కీలకపాత్ర అని తెలిపారు. అద్భుత అవకాశాలకు కొలువైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. 15 ఏండ్ల క్రితం ఇక్కడ వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని వచ్చామని, నేడు ఇక్కడి అవకాశాలు, ప్రభుత్వ సహకారంతో తమ కార్యకలాపాలను అనేక రెట్లు పెంచామని వెల్లడిరచారు. క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు తరువాత తమకు అత్యంత కీలకమైన డ్రగ్ డెవలప్మెంట్, డాటా మేనేజ్మెంట్, పేషెంట్ సేఫ్టీ, తయారీ కేంద్రాలు, ప్రొక్యూర్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ తదితర కార్యకలాపాలు కూడా ప్రారంభించామని తెలిపారు.
హైదరాబాద్‌లోని తమ కేంద్రం ఇప్పుడు సర్వీస్ సెంటర్ మాత్రమే కాదని, కార్పొరేట్ సెంటర్ అని వెల్లడిరచారు. ప్రపంచంలో తమకున్న మూడు ముఖ్య కేంద్రాల్లో ఇదీ ఒకటని పేర్కొన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం ఔషధాల ఆవిష్కరణ ఎంతో అవసరమని చెప్పారు. పరిశోధన, సాంకేతికత అభివృద్ధితో అనేక వ్యాధులకు కొత్త ఔషధాలు, వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. నూతన ఆవిష్కరణల ఫలితంగా నేడు అత్యంత ప్రమాదకర కార్డియో వాస్కులర్ వ్యాధికి మెరుగైన ఔషధాలు అందుబాటుకి వచ్చాయని.. మలేరియా, కుష్టు వంటి మొండి వ్యాధులు కూడా పూర్తిగా నయమవుతున్నాయని వివరించారు. అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్ వ్యాధి నిర్మూలనలోనూ ఎంతో ప్రగతి సాధించామని.. ఇమ్యునో ఆంకాలజీ, టార్గెటెడ్ థెరపీ వంటి విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. టార్గెట్ రేడియేషన్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు నష్టం జరుగకుండా క్యాన్సర్ కణాలను నిర్మూలించవచ్చని వెల్లడిరచారు. మెదడులో ఏర్పడే ట్యూమర్లను కూడా ఈ విధానం ద్వారా నిర్మూలించవచ్చని తెలిపారు.
బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ మాట్లాడుతూ, ముచ్చెర్ల ఫార్మా సిటీ, జీనోమ్ వ్యాలీ, డివైజ్ పార్కుల గురించి ప్రచారం చేయటం ద్వారా అనేక అంతర్జాతీయ ఫార్మా, మెడ్‌టెక్, బయోటెక్ కంపెనీల దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని తెలిపారు. ఎన్నో కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న ప్రణాళికలే ఈ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో వివిధ కంపెనీల ప్రతినిధులు, విజిటర్లు కలిపి 5,600 మంది పాల్గొన్నారు. 175 ఎగ్జిబిటర్లతో ట్రేడ్ సెంటర్‌ను ఏర్పాటు చేయగా, ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రోజుకు దాదాపు 1,100 మంది చొప్పున రెండున్నర రోజుల్లో 2,300 మందికి పైనే సందర్శించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో 2015 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వీరిలో 50కి పైగా దేశాల నుంచి ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఉన్నట్టు వెల్లడించారు.
కరోనా కంటే ముందు నిర్వహించిన ఎడిషన్ల కంటే 20వ ఎడిషన్ ఎంతో ప్రత్యేకమైనదిగా నిర్వహకులు తెలిపారు. అంచనాలకు మించి కంపెనీల ప్రాతినిధ్యం వహించాయని, లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంవల్లే ఈ స్థాయిలో స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ఈసారి పదుల సంఖ్యలో విదేశీ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో విదేశీ ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్, ఆర్ అండ్ డీ కంపెనీల దృష్టి తెలంగాణపై పడిరదని అధికారులు చెప్పారు. ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, బయో ఏషియా సదస్సు సీఈవో శక్తి నాగప్పన్ సదస్సు విజయవంతమయ్యేందుకు కృషి చేశారు.
భారీగా పెట్టుబడుల రాక
బయో ఏసియా సదస్సు సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు ఒప్పందాలను చేసుకున్నారు. ఎసజీడీ ఫార్మా, కోర్నింగ్ సంస్థలు రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ సామగ్రి ఉత్పత్తిలో ఈ పెట్టబడులు పెట్టనున్నట్లు తెలిపాయి. బయో ఏషియా 2023 సదస్సులో ఐటీ మంత్రి కె. తారక రామారావుతో సమావేశం అనంతరం రెండు సంస్థలు ఈ విషయాన్ని ప్రకటించాయి. ఈ పెట్టుబడులతో మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 150 మందికి శాశ్వత ఉద్యోగాలు, 300 కంటే ఎక్కువ మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని ఎస్జీడీ ఫార్మా ఎండీ అక్షయ్‌సింగ్ తెలిపారు. కోర్నింగ్ సంస్థ ఎండీ సుధీర్పిళ్లై మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ నాణ్యతను మెరుగుపరచి క్లిష్టమైన ఔషధాల పంపిణీ వేగవంతం చేస్తామని తెలిపారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన కోర్నింగ్ సంస్థ ఎస్జీడీ ఫార్మాతో కలిసి రాష్ట్రంలో ప్రపంచస్థాయి ‘ఫెసిలిటీ సెంటర్’ ఏర్పాటు చేయబోతుండడంపై హర్షం వ్యక్తం చేశారు.
సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్ గ్రూప్ సంస్థ 2 మిలియన్ డాలర్లతో ‘పార్టికల్ క్యారక్టరైజేషన్ ల్యాబ్రేటరీ’ని తెలంగాణలో నెలకొల్పనుంది. అలాగే యూకేకు చెందిన టెక్ బయో కంపెనీ ఈగల్ జెనోమిక్స్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన ఫాక్స్ లైఫ్ సైన్సెస్ రాష్ట్రంలో రూ.200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించింది. ఫాక్స్లైఫ్ సైన్సెస్ ఇండియా ఎండీ ఏక్నాథ్ కులకర్ణి మాట్లాడుతూ కస్టమ్ మెడికల్, ఎస్యూటీ ఫార్మాలో తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి సేవలను అందిస్తామని తెలిపారు.హైదరాబాద్ భారత ఆర్థిక కేంద్రంగా ఎదిగిందని అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ సావిల్స్ వెల్లడిరచింది.
ఫార్మా, లైఫ్ సైన్స్‌లో దిగ్గజ సంస్థ అయిన జూబిలెంట్ భార్తియా గ్రూప్, హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బయో ఏషియా – 2023 సదస్సులో జూబిలెంట్ భార్టియా గ్రూప్ వ్యవస్థాపకుడు, కో-ఛైర్మన్ ఎస్ భార్టియా మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
నూతన చికిత్స విధానాన్ని ఆవిష్కరించిన బయో ఏసియా సదస్సు
బీహెచ్ఐసీసీ వేదికగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన బయో ఏషియా సదస్సు వివిధ వ్యాధుల నియంత్రణకు నూతన చికిత్సా విధానాలు, ఔషధాలను పరిచయం చేసింది. 76 వరకు ఏర్పాటైన స్టార్టప్‌లు.. బయోటెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికాయి. బయో ఏషియా సదస్సులో మొత్తం 2 వేలకు పైగా ప్రతినిధులు, 175 ఎగ్జిబిటర్లతో పాటు 76 స్టార్టప్‌లు కొలువుదీరాయి. అందులో ఉత్తమ ఆవిష్కరణలను గుర్తించేందుకు నిపుణులతో కసరత్తు చేసిన నిర్వాహకులు 12 స్టార్టప్‌లను ఎంపిక చేసి.. చివరగా ఐదింటిని ఉత్తమ ప్రొడక్టులుగా గుర్తించారు. ఇందులో క్యాన్సర్ చికిత్సలో మెరుగైన వైద్యాన్ని అందించి ప్రాణాపాయాన్ని తప్పించే ఉత్పత్తులతోపాటు, వైకల్యంతో బాధపడే వారికి సాయపడే కృత్రిమ చేతులు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన 5 అంకురాలలో రెండు తెలంగాణ నుంచి ప్రాతి నిధ్యం వహించడం విశేషం. విజేతలైన ఎక్సోబోట్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాంబ్డాజెన్ థెరాప్యు టిక్స్, ప్రతిభ హెల్త్‌కాన్, రాంజా జీనోసెన్సర్, సత్య ఆర్ఎక్స్ ఫార్మా ఇన్నోవేషన్స్ స్టార్టప్‌ల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ సత్కరించారు.
ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్, ఆరోగ్య రక్షణ సదస్సు బయో ఆసియా-2023 చర్చా గోష్టిలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేషన్లు, పేరొందిన ఆరోగ్య రక్షణ రంగ నిపుణులు, విద్యాసంస్థల అధినేతలు, స్టార్టప్‌ల ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. బయో ఆసియా సదస్సులో భాగంగా రెండో రోజు ఐదు కీలక అంశాలపై చర్చా గోష్టులు జరగ్గా ఆపిల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి మధ్య ఫైర్‌సైడ్ చాట్ జరిగింది. 50కి పైగా దేశాల నుంచి రెండువేల మందికిపైగా ప్రతినిధులు హాజరు కాగా, రెండు రోజుల్లో రెండు వేల ముఖాముఖి వాణిజ్య సమావేశాలు జరిగాయి.






