తెలంగాణలో మరో భారీ పెట్టుబడి… రూ.250 కోట్లతో
తెలంగాణ రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కంపెనీ గోద్రెజ్ ఆగ్రోవెంట్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడితో ఖమ్మం జిల్లాలో అత్యాధునిక వంట నూనెల ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. దీంతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 250 మందికి ప్రత్యక్షంగా, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్లాంటు ఉత్పాదక సామర్థ్యం గంటకు 30 టన్నులు (టీపీహెచ్). భవిష్యత్తులో దీన్ని 60 టీపీహెచ్కు పెంచుకునే అవకాశాలున్నాయి. గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. ఖమ్మం జిల్లాలో ఇడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు, తద్వారా ఆ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లోని పామాయిల్ ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు వీలు కలుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.






