సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో “గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు”

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక "గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు" ను సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదిక కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సమ్మిట్ లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ప్రపంచ నలుమూలల్లోని కృత్రిమ మేథా రంగ నిష్టాతులు, ఐటీ నిపుణులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం సభలో మాట్లాడుతూ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై అంతర్జాతీయ స్థాయి సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వకారణంగా ఉందని అన్నారు. పక్క రాష్ట్రంలో పోటీ పడాలన్న ఉద్దేశంతో కాకుండా తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కోసం 200 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిందని తెలిపారు. త్వరలోనే గ్లోబల్ ఏఐ సమిట్ కోసం అధికారిక వెబ్ సైట్ ప్రారంభించనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందులో ప్రోగ్రామ్ షెడ్యూల్ తో పాటు రిజిస్ట్రేషన్ల సమాచారం, స్పీకర్ల ప్రొఫైల్స్ తదితర వివరాలు ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.