తెలంగాణలో 200 కోట్లతో ఫాక్స్ లైఫ్ సైన్సెస్
హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఏషియా సదస్సు పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రానికి లాభదాయకంగా మారింది. ఈ సమావేశాల సందర్భంగా పలు కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఫాక్స్ లైఫ్ సైన్సెస్, ప్రపంచ అగ్రగామి సంస్థ సర్పేస్ మేజర్మెంట్ సిస్టమ్స్ బ్రిటన్‌కు చెందిన ఈగల్ జెనోమిక్స్ తమ కార్యకలాపాల విస్తరణపై ప్రకటనలు చేశాయి. ఫాక్స్ లైఫ్‌సైన్సెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ తెలంగాణలో ఎస్యూటీ( ఔషధ తయారీకి సింగిల్ యూజ్ టెక్నాలజీ)లో సామర్థ్యాల విస్తరణకు రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. ఆ సంస్థ ఇదివరకే తమ మొదటి అంతర్జాతీయ ప్లాంట్ కోసం మన రాష్ట్రాన్ని ఎంచుకొని వేర్‌హౌస్, లాబొరేటరీ ఉత్పత్తుల కోసం వైట్ రూమ్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్లాస్`6 క్లీన్ రూమ్‌ను విజయవంతంగా ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏక్నాథ్ కులకర్ణి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో భాగంగా తమ మొదటి అంతర్జాతీయ ప్లాంట్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. రానున్న కాలంలో హైదరాబాద్‌లో లైఫ్‌సైన్సెస్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి కస్టమ్ మెడికల్, ఎస్యూటీ ఫార్మా అసెంబ్లీలను తక్కువ ధరలకే వినియోగదారులకు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రపంచ అగ్రగామి సంస్థ సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్ (ఎస్ఎంఎస్) గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెండు మిలియన్ డాలర్ల (సుమారు రూ.16.58 కోట్లు) పెట్టుబడితో అధునాతన పార్టికల్ క్యార్టరైజేసన్ ల్యాబొరేటరీస్ (పీసీఎల్)ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇదికాకుండా వచ్చే మూడేండ్లలో మరో మూడు మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్టు తమ ప్రణాళికను వెల్లడించింది.






