Praveen sawhney: అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి : ప్రవీణ్ సాహ్ని

అమెరికాపై ఆధారపడటాన్ని భారత్ (India) తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ విశ్లేషకుడు ప్రవీణ్ సాహ్ని (Praveen sawhney) పేర్కొన్నారు. మంథన్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో మంథన్ సంవాద్-2025 వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవీణ్ సాహ్ని మాట్లాడుతూ అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో క్రమేణా అస్థిరత్వం పెరుగుతోందని, అదే సమయంలో ప్రపంచ దక్షిణ భాగంలో స్థిరత్వం పెరగడం సానుకూలాంశమని చెప్పారు. చైనా (China) తో మరింత సమతౌల్య విదేశాంగ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఆర్థికవేత్త, కౌటిల్య స్కూల్ ఫ్యాకల్టీ రథిన్ రాయ్ (Rathin Roy) మాట్లాడుతూ సామాజిక వెనుకబాటుతనం, కుల వివక్ష సమస్యలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యత్యాసాలను పరిష్కరించడానికి విధానపరంగా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జాతీయ, అంతర్జాతీయ కీలక పరిణామాలతోపాటు రక్షణ, ఆర్థిక, చరిత్ర, సైన్స్, జర్నలిజం, న్యాయం కళలు వంటి అంశాలపై పలువురు ప్రముఖులు ప్రసంగించారు.