Prabhakar Rao: అమెరికా నుంచి మీ ఫోన్లను తెప్పించండి.. సిట్ అధికారులు ఆదేశం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) మరోమారు సిట్ విచారణకు హాజరయ్యారు. ట్యాపింగ్ జరిగినప్పుడు ప్రభాకర్‌రావు వాడిన అధికారిక సెల్‌ఫోన్ (Cellphone)ను మాత్రమే ఆయన సిట్‌కు అందజేశారు. ల్యాప్‌టాప్ (Laptop), ట్యాబ్ (Tab)లలో డాటాను ఆయన డిలీట్ చేయడంతో, సిట్ అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్ విశ్లేషణ, డాటా రికవరీకి పంపారు. అయితే, ప్రభాకర్‌రావు ట్యాపింగ్ సమయంలో వాడిన రెండు సెల్‌ఫోన్లను అమెరికాలోనే వదిలేశారు. దీంతో మీ ఫోన్లను అమెరికా (America )నుంచి తెప్పించండి అంటూ సిట్ అధికారులు ప్రభాకర్‌రావును ఆదేశించారు. అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించినా, విచారణకు సహకరించలేదని తెలిసింది.
ఎస్‌ఐబీలో ఆధారాలను ధ్వంసం చేయడం, అక్రమంగా, మోసపూరితంగా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేయడం, ప్రభాకర్‌రావు వాడిన ఎలకా్ట్రనిక్ పరికరాలపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ చేశాక, ఆ సమాచారాన్ని ఎవరికి పంపేవారు? ఎందుకోసం నిఘా పెట్టారు? అనే కోణాల్లో ప్రశ్నించారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు 300 మంది బాధితుల వాంగ్మూలాలను నమోదు చేయగా, వారిలో కొందరి పేర్లను ప్రస్తావిస్తూ, వారి నంబర్లను ఎందుకు ట్యాపింగ్ చేశారు? అంత అవసరమేమొచ్చింది? అని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్‌రావు చాలా వరకు సమాధానాలు చెప్పలేదని తెలిసింది. విచారణకు సహకరించకుండా, మౌనంగా కూర్చున్నట్లు సమాచారం.