Uttam Kumar Reddy: ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేదీ లేదు : మంత్రి ఉత్తమ్
ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ తమ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, దీనిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్‌లో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ హైదరాబాద్ ను కాలుష్య రహితంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకే పరిశ్రమలను నగరం బయటకుపంపుతున్నట్లు చెప్పారు. ఇండస్ట్రియల్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి అస్కారం లేదని స్పష్టంచేశారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ పార్టీల నేతలకు ఈ పాలసీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విధానాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేదీ లేదు, పాలసీని మార్చేదీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరోపిస్తున్నట్లుగా విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) పవర్ ప్రాజెక్టే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఇండియా బుల్ అనే కంపెనీ నుంచి ఉపయోగంలో లేని పరికరాలు కొనుగోలు చేసి సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని నిర్మించారని, ఇప్పుడు అది ఎందుకూ ఉపయోగించలేని పరిస్థితి ఉందని చెప్పారు.






