Election Code: తెలంగాణలో ఎన్నికల కోడ్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల నియమావళి సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది.హైదరాబాద్(Hyderabad) , మేడ్చల్ (Medchal), మల్కాజిగిరి(Malkajgiri) మినహా మిగిలిన జిల్లాల్లో నియామావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచిస్తూ మంగళవారం సంబంధిత విభాగం మార్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో, బయట గోడలపై రాజకీయ నాయకుల ఫొటోలు, పేర్లుగాని వారికి సంబంధించిన గుర్తులు, జెండాలుగాని ఉండకూడదని పేర్కొన్నారు. ఒకవేళ ఉంటే వాటిని తొలగించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో రాజకీయ వ్యాఖ్యలు, చర్చలు, పోస్ట్‌లు చేయకూడదని, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని పేర్కొన్నారు.