Suravaram Sudhakar : సీపీఐ అగ్రనేత సురవరం ఇక లేరు

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి, సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar) (84) ఇక లేరు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటల సమయంలో సుధాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచినట్లు సీపీఐ అధికారికంగా ప్రకటించింది. కొన్నాళ్లుగా ఆయన ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ను వినియోగిస్తున్నారు. సురవరం సుధాకర్ రెడ్డికి భార్య విజయలక్ష్మి (Vijayalakshmi), కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమారుడు నిఖిల్ (Nikhil) ఆదివారం ఉదయానికి భారత్ చేరుకుంటారని సమాచారం. అప్పటివరకు సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని గచ్చిబౌలి కేర్ మార్చురీలో ఉంచుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ భౌతికకాయాన్ని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గాంధీ వైద్యకళాశాలకు సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని అప్పగిస్తామని నారాయణ వెల్లడించారు. కాగా, సురవరం నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు.
సీపీఐలో క్రియాశీల కార్యకర్తగా చేరిన సురవరం సుధాకర్‌రెడ్డి 1971లో జాతీయ సమితి సభ్యునిగా పనిచేశారు. మూడేళ్లపాటు ఢిల్లీలో ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. తొలిసారి 1998 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అదే ఏడాది సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో ఎంపీ (MP) గా ఎన్నికయ్యాక, కార్మికశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేయటంతోపాటు అనేక పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా పనిచేశారు. 2012 మార్చి 31న జరిగిన 21వ పార్టీ కాంగ్రె్‌సలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో మూడు పర్యాయాలు సేవలందించారు. సురవరం సుధాకర్ రెడ్డి 1998లో 12వ లోక్‌సభకు నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.