హైదరాబాద్ లో ఆకాశమంత భవనాల నిర్మాణాలు

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకోవడంతో చాలామంది రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో తమ ప్రాజెక్టులను నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. డిమాండ్ బాగా ఉండటంతో ఆకాశమంత భవనాలను కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలికాలంలో ఈ ఆకాశ భవనాల నిర్మాణాలు బాగా పుంజుకున్నాయి. ముంబై, ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో ఎక్కువగా కనిపించే ఈ హైరైజ్ నిర్మాణాలు హైదరాబాద్‌లోనూ జోరందుకోవడం విశేషం. అత్యంత ఎత్తులో నివాసం ఉండాలని కోరుకునే వాళ్ల సంఖ్య పెరగడం, భవనాల ఎత్తుకు నిబంధనలను లేకపోవటం, స్థలాల కొరత వంటివి నగరంలో ఆకాశహర్మ్యాల పెరుగుదలకు కారణమని చెబుతారు. గతేడాది హైదరాబాద్‌లో 10, అంతకంటే ఎత్తయిన హైరైజ్ ప్రాజెక్ట్‌లు 57 ప్రారంభం కాగా.. బెంగళూరులో 51, చెన్నైలో 10 ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలలోనే హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచిందని అనరాక్ రిపోర్ట్ తెలిపింది.
దేశంలో అత్యధికంగా ముంబైలో 263, పుణేలో 170 హైరైజ్ ప్రాజెక్ట్‌లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఏటా సగటున 1,400 అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేపడితే అందులో సగటున 200 వరకు ఐదు అంతస్తులపైన ఉండే బహుళ అంతస్తుల నివాస సముదాయాలు కనిపిస్తున్నాయి. ఇందులో నాలుగో వంతు 10 అంతకంటే ఎక్కువ అంతస్తులపైన ప్రాజెక్ట్‌లుంటాయి. 2019లో 236 ఐదు ఫ్లోర్లపైన నివాసాల బహుళ నిర్మాణ ప్రాజెక్ట్‌లు వస్తే.. 2020లో కోవిడ్ లాక్‌డౌన్‌తో 115కి తగ్గాయి. 2021లో మళ్లీ పుంజుకుంది. 2020తో పోలిస్తే గతేడాది హైరైజ్ భవనాల లాంచింగ్స్‌లో 41 శాతం వృద్ధి రేటు నమోదయింది.
గతేడాది గ్రేటర్ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి లభించగా.. ఇందులో 57 హైరైజ్ భవనాలే. షేక్‌పేట, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో ఎక్కడ చూసినా ఆకాశమంత ఎత్తులో కట్టే భవంతులే కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. సహజంగానే ఇక్కడ కొలువు ఉండే ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉండటంతో ఎకరాల విస్తీర్ణంలో ఆకాశాన్నంటే ఎత్తయిన గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. బంజారాహిల్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఉప్పల్, బేగంపేట, సంతోష్‌నగర్, అత్తాపూర్, అప్పా జంక్షన్, బాచుపల్లి, మియాపూర్, సికింద్రాబాద్, బొల్లారం వంటి ప్రాంతాలలో భారీ భవంతులు వస్తున్నాయి. పాత వాటి స్థానంలో ఎత్తయిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, దగ్గర్లో విద్యా, వైద్య సదుపాయాలు ఉండటం అన్నింటికీ మించి సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏటేటా ఈ తరహా ఎత్తయిన గృహ సముదాయాలు పెరుగుతున్నాయి
2021లో 7 శాతం పెరిగిన ఇళ్ళ ధరలు
గత సంవత్సరం హైదరాబాద్ మార్కెట్లో 22,239 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 36 శాతం వృద్ధి నమోదైంది. కాగా హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు గణనీయంగా 7 శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది మెట్రో నగరాల్లో 2021 సంవత్సరంలో ఇళ్ల ధరలు 3`7 శాతం మధ్య పెరిగినట్టు ప్రాప్‌టైగర్.కామ్ రూపొందించిన రియల్ ఎస్టేట్ ఇన్‌సైట్ రెసిడెన్షియల్ యాన్యువల్ రౌండప్ 2021 నివేదిక పేర్కొంది. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్ తదితర రేట్లు పెరగడమే ఇళ్ల ధరల వృద్ధికి దారితీసినట్టు పేర్కొంది. ఎనిమిది నగరాల్లో ఇళ్ల విక్రయాలు 2021లో 13 శాతం పెరిగి 2,05,936 యూనిట్లుగా ఉన్నాయి. 2020లో విక్రయాలు 1,82,639 యూనిట్లుగా ఉండడం గమనించాలి. అహ్మదాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు 7 శాతం పెరగ్గా, బెంగళూరులో 6 శాతం, పుణేలో 3 శాతం, ముంబైలో 4 శాతం, చెన్నై, ఢల్లీి ఎన్‌సీఆర్, కోల్‌కతా మార్కెట్లలో 5 శాతం చొప్పున ధరలు 2021లో పెరిగాయి. .
ఈ ఏడాది ఇళ్ల ధరలు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలే కాదు.. కొనుగోలుదారులూ అభిప్రాయపడుతున్నారు. నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్.. సీఐఐతో కలసి వినియోగదారుల అభిరుచులపై ఒక సర్వే నిర్వహించింది. 2021 జూలై నుంచి డిసెంబర్ మధ్య ఈ సర్వే జరిగింది. ఈ వివరాలను అనరాక్ వెల్లడిరచింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 5,210 మంది తమ అభిప్రాయాలు వెల్లడిరచారు.నిర్మాణ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో ఇళ్ల ధరలు పెరుగుతాయని అంచనాతో ఉన్నట్టు 55 శాతం మంది చెప్పారు. అయితే ధరలు పెరగడం 10 శాతం లోపు ఉంటే డిమాండ్‌పై మోస్తరు నుంచి, తక్కువ ప్రభావమే ఉంటుందని.. 10 శాతానికి మించి పెరిగితే మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్‌పై గట్టి ప్రభావమే చూపిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. రియల్ ఎస్టేట్‌ను ఒక ఆస్తిగా పరిగణిస్తున్నవారి సంఖ్య 2021 తొలి ఆరు నెలల్లో 54 శాతంగా ఉండగా, ద్వితీయ ఆరు నెలల్లో 57 శాతానికి పెరిగింది.
47 అంతస్తుల ఈ ప్రాజెక్ట్ వినూత్నం
హైదరాబాద్ నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కో లివింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి రేరా నుంచి అనుమతులు వచ్చాయి. మొత్తం 47 అంతస్థులతో హైదరాబాద్ వన్ పేరుతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 41 అంతస్థులు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లకు కేటాయించగా 5 అంతస్థులను కేవలం కో లివింగ్ కోసమే కేటాయిస్తున్నారు. మిగిలిన ఫ్లోర్‌లో స్విమ్మింగ్‌పూల్, సెవెన్‌స్టార్ బార్, జిమ్ , కేఫ్‌టేరియా ఇతర సౌకర్యాల కోసం ఉపయోగించనున్నారు. అయితే కో లివింగ్ ఫెసిలిటీని కేవలం మహిళలకే కేటాయించారు. ప్రతీ గదిలో ఇద్దరు మహిళలు ఉండవచ్చు. గది వైశాల్యం 397 చదరపు అడుగుల నుంచి 546 చదరపు అడుగుల వరకు ఫుల్ ఫర్నీచర్ ఎక్విప్‌మెంట్‌తో ఉంటాయని నిర్మాణ సంస్థ చెబుతుంది. వీటికి నెలవారీ అద్దె రూ. 26,000ల నుంచి రూ. 36,000 రేంజ్‌లో ఉండవచ్చని అంచనా. బ్యాక్‌గ్రౌండ్ ఫుల్ వెరిఫికేషన్ పూర్తైన వారినే కోలివింగ్‌కి అనుమతి ఇస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది. ప్రతీ రూమ్‌లో పానిక్ బటన్ అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తోంది. రిలీజియన్, జెండర్, క్యాస్ట్ తదితర వివక్ష పాటించని వారికే ఇందులో అనుమతి అని చెబుతోంది. ఈ భారీ భవనంలో ఎవరైనా డ్రగ్ వంటి మత్తు పదార్థాలు వాడుతున్నట్టు సమాచారం అందిస్తే నజరానా కూడా అందిస్తామంటోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో రూ. 1500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 2026 చివరి నాటికి 47 అంతస్థుల భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హెచ్ 1 పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం 160 మీటర్ల ఎత్తుతో ఉండబోతుంది. ప్రపంచంలోనే కోలీవింగ్‌కి సంబంధించి ఇదే అతి పెద్దదని నిర్మాణ సంస్థ అంటోంది. కోలివింగ్ కోసం ప్రత్యేకంగా భవనాలు నిర్మించే ట్రెండ్ ప్రస్తుతం యూకేలో ఎక్కువగా ఉందని. ఇండియాలో హైదరాబాద్‌తో ఈ ట్రెండ్ రానుందని నిర్మాణ కంపెనీ అంటోంది.