Kishan Reddy: నైతిక విలువలు కాపాడేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు: కిషన్ రెడ్డి

పదవుల్లో ఉన్నప్పుడు ఆరోపణలు ఎదురైనప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సూచించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగించడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ జైల్లో ఉంటూనే అధికారులతో రివ్యూ మీటింగ్‌లు నిర్వహించి, ప్రభుత్వ యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించారని కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ కూడా జైలుకు వెళ్లినప్పటికీ రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వాలను కాపాడే నాయకులకు, పార్టీలకు నైతిక విలువలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. కొందరు నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, అందుకే కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చిందని కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఈ బిల్లును ఏకపక్షంగా తీసుకురావడం లేదని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారా ప్రజల, మేధావుల, న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ బిల్లు వల్ల అవినీతిపరులకు బాధ కలుగుతోందని, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదని ఆయన (Kishan Reddy) చురకలేశారు.