Navin Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీసీనే నమ్ముకున్న కాంగ్రెస్!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు (Jubilee Hills ByElection) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. ముందు నుంచీ రేసులో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన వి.నవీన్ యాదవ్ (Navin Yadav) పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి చెందడంతో నవంబర్ 11న ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) పార్టీకి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో తమ సత్తా చాటాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వానికి మరింత బలం చేకూర్చాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.
నవీన్ యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ నాయకుడు. ఆయన వయసు 41 సంవత్సరాలు. ఆయన ఆర్కిటెక్చర్ చదివారు. రాష్ట్ర యాదవ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా, తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, నవ్ యువ నిర్మాణ్ అనే ఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. నవీన్ యాదవ్ గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం (AIMIM) అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 42,000 ఓట్లు సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 19,000 ఓట్లు పొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వడంతో నవీన్ యాదవ్ వెనక్కు తగ్గారు. అనంతరం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జిగా పనిచేశారు. నవీన్ యాదవ్‌కు నియోజకవర్గంలో, ముఖ్యంగా బస్తీ ప్రాంతాల ఓటర్లలో, బీసీ సామాజికవర్గంలో మంచి పట్టు, స్థానిక పరిచయాలు ఉన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంచుకోవడంలో ముఖ్యంగా రెండు కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి బీసీ కార్డు. కాంగ్రెస్ మొదటి నుంచీ బీసీ వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల ఓటర్లు ఉండగా, ఇందులో దాదాపు 1.40 లక్షల మంది బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. యాదవ సామాజికవర్గానికి చెందిన నవీన్‌ను నిలబెట్టడం ద్వారా ఈ భారీ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయవచ్చని పార్టీ భావిస్తోంది. ఇటీవల బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదం తెలపడం కలిసొస్తుందని నమ్ముతోంది. రెండోది మైనారిటీల మద్దతు. నియోజకవర్గంలో బీసీలతో సమానంగా సుమారు 1.40 లక్షల మంది ముస్లింలు మరియు ఇతర మైనారిటీ వర్గాల ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా మైనారిటీ ఓటర్ల పట్ల పట్టున్న అభ్యర్థినే ఎంచుకోవాలని చూసింది. నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడం, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ యువ, స్థానిక అభ్యర్థికి పరోక్ష మద్దతు ఇవ్వాలనే వైఖరిని ప్రదర్శించడం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశాలు. ఎంఐఎం మద్దతు పరోక్షంగా కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లను ఏకం చేయడంలో సహాయపడుతుందని పార్టీ విశ్వసిస్తోంది.
నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మొగ్గు చూపింది. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వే నివేదికలన్నీ ఆశావహులందరిలోనూ నవీన్ యాదవ్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని, ఓటర్లతో ఆయనకు బలమైన అనుబంధం ఉందని తేల్చాయి. అందుకే, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి వంటి ఇతర కీలక నేతలు పోటీలో ఉన్నప్పటికీ, అధిష్టానం నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది.
అధికారంలో ఉన్నందున, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళిక వేస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎత్తి చూపాలని నిర్ణయించింది. నవీన్ యాదవ్ స్థానిక నేపథ్యం, బీసీ- మైనారిటీ వర్గాలలో ఆయనకు ఉన్న పట్టు, పార్టీ వ్యూహానికి ప్రధాన బలం. ఆయన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత (BRS) తో పోటీ పడనున్నారు. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరుగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ఒక పరీక్షగా నిలవనుంది.