Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో గ్రాండ్ విక్టరీ.. రేవంత్ రెడ్డికి అడ్డేదీ..?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో (Jubilee Hills By Election) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Navin Yadav) సాధించిన ఘన విజయం కేవలం ఒక నియోజకవర్గ ఫలితం కాదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యూహానికి, ఆయన పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక సిట్టింగ్ స్థానాన్ని ప్రత్యర్థి బీఆర్ఎస్ నుండి లాక్కోవడం ద్వారా, రేవంత్ రెడ్డి తన నాయకత్వ పటిమను మరోసారి తిరుగులేని విధంగా చాటుకున్నారు. సాధారణంగా ఉపఎన్నికలను ముఖ్యమంత్రులు పెద్దగా పట్టించుకోరు. స్థానిక నేతలు, మంత్రులకు అప్పగిస్తూ ఉంటారు. కానీ, రేవంత్ రెడ్డి ఈ పోరును వ్యక్తిగత సవాలుగా స్వీకరించారు, తన రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన మైలురాయిగా మార్చుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం వెనుక రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహం బహుముఖమైనదిగా చెప్పొచ్చు. సీఎం హోదాలో ఉండి కూడా, రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచార సరళి, దూకుడు, ప్రత్యర్థులపై విమర్శల పదును… అన్నీ కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపి, ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్చాయి. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో, పార్టీ కేడర్ యావత్తు జూబ్లీహిల్స్‌లో వాలిపోయింది. ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలగలిపి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పట్టు పెంచాయి.
ఈ ఎన్నికలో రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అత్యంత కీలకాంశం వివిధ వర్గాల సమన్వయం. ఇది సాంప్రదాయ ఎన్నికల ప్రచారానికి మించి, ఓట్ల సమీకరణకు దారితీసింది. ఉపఎన్నికకు ముందు ఎంఐఎం (MIM) మద్దతు కూడగట్టడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ పట్టున్న మైనారిటీ ఓట్లను చీల్చడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు కేబినెట్ మంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా ముస్లిం వర్గాల్లో పార్టీ పట్ల సానుకూలత పెరిగింది. ఆయా కుల, మత, సామాజిక వర్గాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై, వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం ద్వారా ప్రతి ఓటు బ్యాంక్‌ను దరిచేర్చుకున్నారు.
తెలుగుదేశం పార్టీ (TDP) వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన, ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి బలమైన అభిమానులు ఉన్న జూబ్లీహిల్స్ వంటి ప్రాంతంలో, ఆ వర్గం ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించడానికి ఒక బలమైన సంకేతంగా పనిచేసింది. సినీ ప్రముఖులకు చేరువయ్యే ప్రయత్నం, వారికి తాయిలాలు ప్రకటించడం వంటి చర్యలు, జూబ్లీహిల్స్‌లో గణనీయంగా ఉన్న సినీ వర్గాల ఓటర్లను ప్రభావితం చేశాయి.
ఈ విజయం వల్ల కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే తోడవుతారు. కానీ దీనివల్ల రేవంత్ రెడ్డి పొలిటికల్ మైలేజ్ మరింత పెరుగుతుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గెలవడం ద్వారా, ‘చేతికి చిక్కిన అవకాశాన్ని రేవంత్ వదలడు’ అనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఇది ఆయన చరిష్మాను మరింత పెంచుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో, రాష్ట్రంలో పార్టీని గెలుపు బాటలో నడిపించగల శక్తివంతమైన నేతగా ఆయన స్థానం సుస్థిరమవుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతలకు, ఈ విజయం ఒక బలమైన సంకేతం. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీకి భవిష్యత్తు ఉందని, ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి పనైపోయింది, పాలనపై పట్టులేదు అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి ఈ విజయం ఒక సమాధానంగా నిలిచింది.
జూబ్లీహిల్స్ విజయం రేవంత్ రెడ్డికి ఓట్ల బలం కన్నా, రాజకీయ బలాన్ని అందించింది. ఈ ఎన్నికను సవాల్‌గా స్వీకరించి, తన వ్యూహ చతురతతో, రాజీలేని పోరాటంతో ఆయన సాధించిన ఈ విజయం… ఆయనను కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా, తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు.






