Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు నోటీసు… వేటు ఖాయమా..?

తీన్మార్ మల్లన్న (teenmar mallanna).. ఈ పేరు సుపరిచితం. బడుగు బలహీన (BC) వర్గాలకోసం తనదైన శైలిలో ఆయన వాణి వినిపిస్తుంటారు. ఇండిపెండెంట్ గా చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు. బీఆర్ఎస్ (BRS) పై ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో (BJP) చేరారు. అక్కడ చాలాకాలం ఉండలేకపోయారు. చివరకు కాంగ్రెస్ (Congress) లో చేరి ఎమ్మెల్సీ (MLC) అయ్యారు. కనీసం ఇక్కడైనా కుదురుగా ఉంటారా అంటే అదీ లేదు. ఇక్కడ సొంతపార్టీకే చుక్కలు చూపెడుతున్నారు. పార్టీ వ్యతిరేక విధానాలతో పెద్ద సమస్యగా మారారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనను వ్యతిరేకించి వార్తల్లో నిలిచారు.
తెలంగాణలో (Telangana) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కులగణనను (Caste census) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదేశాల మేరకు ఇది పూర్తి చేసింది. కులగణనకు బీజేపీ వ్యతిరేకంగా ఉంది. దీంతో తాము కులగణన చేపట్టి అందుకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ. తాజా లెక్కల్లో బీసీలు అత్యధికంగా ఉన్నట్టు తేలింది. దానికి అనుగుణంగా కులాల వర్గీకరణ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అయితే రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణనను ఎమ్మెల్సీ మల్లన్న తీవ్రంగా దుయ్యబట్టారు. ఇది వాస్తవానికి దూరంగా ఉందని మండిపడ్డారు. కులగణన కాపీలను తగలబెట్టారు.
కులగణనకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపాయి. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని పార్టీలో పలువురు నేతలు డిమాండ్ చేశారు. దీంతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) ఆయనకు నోటీసులు జారీ చేశారు. మల్లన్న వివరణ అనంతరం ఆయనపైచ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపైన కూడా మల్లన్న నోరు జారుతున్నారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా మల్లన్న వ్యవహార శైలి ఉండడంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు.
అంతేకాదు.. తాజాగా నల్గొండలో (Nalgonda) బీసీల రణభేరిలో (BC Meeting) మల్లన్న చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. రెడ్లకు వ్యతిరేకంగా మల్లన్న (Mallanna comments on Reddys) బూతులు మాట్లాడారు. కాబోయే సీఎం బీసీయోనని.. చివరి అగ్రకుల సీఎం రేవంత్ రెడ్డేనని మల్లన్న ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అదే మాటపై ఉన్నారు. ఇవి రెడ్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మల్లన్నపై పలుచోట్ల రెడ్లు ఫిర్యాదులు చేశారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు. మల్లన్న వ్యవహారశైలీ తీవ్ర ఆక్షేపణీయంగా ఉండడం, ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో తప్పకుండా చర్యలు తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.