Koppula Eshwar: కొత్త బొగ్గు గనుల విషయంలో కాంగ్రెస్ కాలయాపన: కొప్పుల ఈశ్వర్
కొత్త బొగ్గు గనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కాలయాపనకు వ్యతిరేకంగా సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) హెచ్చరించారు. కొత్త బొగ్గు గనుల సాధన, ఆదాయ పన్ను రద్దు డిమాండ్లతో ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తామని, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి భవన్ ఎదుట నిరసనలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి భవిష్యత్తు కొత్త బొగ్గు గనులను సాధించడంతో ముడిపడి ఉన్నదని, ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండానే తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి (Singareni) సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని నాలుగు ఉమ్మడి జిల్లాలలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించి కార్మికుల, తెలంగాణ ప్రజల ఉపాధి అవకాశాలను కాపాడాలని ఆయన (Koppula Eshwar) కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.







