Congress: జూబ్లీహిల్స్ లో వెనుకబడుతున్న కాంగ్రెస్..!?

తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ (Jubilee Hills Assembly) నియోజకవర్గ ఉప ఎన్నిక (by poll) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దీనికి కూడా ఉప ఎన్నిక జరగనుందన్న సంకేతాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో, గెలుపు కోసం రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి.
గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్, ఈ ఉప ఎన్నికలోనూ తమ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను (Maganti Sunitha) బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ప్రత్యర్థుల కన్నా ఒక అడుగు ముందుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా, రాష్ట్రంలో తమకు ప్రజాబలం తగ్గలేదని నిరూపించుకోవాలని భావిస్తోంది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, పాలన విఫలమైందని బీఆర్ఎస్ నేతలు బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో గెలుపు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు, భవిష్యత్ రాజకీయాలకు ఒక సంకేతంగా పనిచేస్తుందని ఆ పార్టీ నాయకత్వం విశ్వసిస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక ఒక అగ్నిపరీక్షగా మారింది. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలంటే జూబ్లీహిల్స్‌లో గెలుపు తప్పనిసరి అని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థించాలని చూస్తోంది. ఈ ఎన్నికలో గెలిస్తే, ప్రభుత్వ పనితీరుకు ప్రజల ఆమోదం లభించినట్లవుతుందని, ప్రతిపక్షాల నోరు మూయించవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి కైవసం చేసుకోవడం ద్వారా, రాజధాని నగరంలో పట్టు సాధించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.
గెలుపు అత్యంత కీలకంగా మారిన ఈ తరుణంలో, కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ఖరారు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పార్టీలోని సీనియర్ నేతలు, గతంలో పోటీ చేసిన వారు, కొత్తగా పార్టీలో చేరిన బలమైన నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తమకు సామాజికవర్గాల బలం ఉందని అధిష్టానం వద్ద తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎక్కువ మంది ఆశావహులు ఉండటం పార్టీకి బలమే అయినా, అభ్యర్థి ఎంపికలో జాప్యం చేయడం వల్ల ప్రచారంలో వెనుకబడతామనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్థి ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు అప్పగించారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
అభ్యర్థి ఎంపికలో ఆలస్యం జరిగే కొద్దీ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టికెట్ దక్కని నేతలు అసంతృప్తికి గురై, పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. వారిని బుజ్జగించి, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం అధిష్టానానికి సవాలుగా మారనుంది. ఈ లోపు ప్రత్యర్థి పార్టీ ప్రచారంలో మరింత ముందుకు దూసుకుపోతుంది. వీలైనంత త్వరగా సర్వేలు, అంతర్గత సమీక్షల ఆధారంగా గెలుపు గుర్రాన్ని ఎంపిక చేసి, పూర్తిస్థాయిలో ప్రచార బరిలోకి దిగాలని, లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.