Tamilisai :మాజీ గవర్నర్ తమిళిసై ఇంట్లో విషాదం

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan ) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్ (Kumara Ananthan) ( హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్) (92) కన్నుమూశారు. ప్రముఖ కాంగ్రెస్ నేతగా, గాంధేయవాదిగా, గొప్ప వ్యక్తగా పేరు పొందిన ఆయన, వయో సంబంధిత సమస్యలతో మంగళవారం అర్థరాత్రి 12:15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఒకరు. గాంధీజీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్న ఆయన, పార్లమెంటు (Parliament) లో తొలిసారి తమిళంలో మాట్లాడిన నేతగా రికార్డు నెలకొల్పారు. తమిళ భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. కుమారి అనంతన్ మరణవార్త తెలుసుకున్న తమిళ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం స్టాలిన్ (Stalin), తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామి, వి.శశికళ (V. Sasikala), పన్నీర్ సెల్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై, టీవీకే చీఫ్ విజయ్‌తో పాటు పలువురు సీపీఎం, సీపీఐ నేతలు తమిళ సై తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ కుమారి అనంతన్ మరణం తమిళ సమాజానికి పెద్ద లోటు అన్నారు. ప్రభుత్వ అధికార లాంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.