Revanth Reddy: ఉప రాష్ట్రపతి అభ్యర్థి ని గెలిపించండి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudharshan Reddy) గారిని ప్రకటించడం తెలుగు ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవాన్ని పెంచింది. ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒకవైపు.. మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతున్న ఇండియా కూటమి మరోవైపు… రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణం. ఆయన్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపై ఉంది.
పీవీ నర్సింహారావు తరువాత ఒక తెలుగువాడిని ఆ స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణం. రాజకీయాలకు అతీతంగా మనం ఏకం కావాల్సిన సందర్భం ఇది. తెలుగువాడికి దక్కిన గౌరవం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన. ఉభయ రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది.
చంద్రబాబు నాయుడు, కెసీఆర్, పవన్ కళ్యాణ్, కమ్యూనిస్ట్ సోదరులు, ఉభయ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు.. ఆయన ఇండియా కూటమి ప్రతిపాదించిన న్యాయనిపుణుడు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్.
1991 లో ప్రధాని రేసులో ఉన్న పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినపుడు.. ఆనాడు ఎన్టీఆర్ ఆయనపై పోటీ పెట్టకుండా మద్దతు పలికారు. రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. ఈనాడు ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలి. మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి.







