Revanth Reddy: గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్ గా జహీరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

మెదక్ అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే మెదక్ అని ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ (Zaheerabad) నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్ (Gateway of Industries) గా జహీరాబాద్ నిలవాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నారాయణఖేడ్ (Narayankhed ) అభివృద్ధికి ప్రత్యేక సమీక్ష నిర్వహించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు.
పటాన్‌చెరు ప్రాంతం మినీ ఇండియాలాంటిది. ఈ ప్రాంతంలో ఇందిరమ్మ ప్రధానిగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. సింగపూర్ ప్రాజెక్టు (Singapore Project) ను ఎకో టూరిజం కిద తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు రైతు భరోసా అమలు చేశాం. ఐదేళ్లలోపు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం. అదానీ, అంబానీలతో పోటీపడి వ్యాపారం చేసేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. ఉమ్మడి మెదక్ (Medak )జిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర సాయం తీసుకుంటాం. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధిని సాధించగలం. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. ఎవరేం అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. చక్కెర పరిశ్రమ కోసం సహకార సంఘం ఏర్పాటు చేసుకుంటే, నిమ్జ్ లో 100 ఎకరాలు కేటాయించడంతోపాటు నిధులు కూడా మంజూరు చేయిస్తా అని అన్నారు.