Revanth Reddy: లైఫ్ సైన్సెస్ రంగం లో విస్తృత అవకాశాలు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిశ్రమలు కలిసి రావాలని ముఖ్యమంతి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్ రంగాల్లో అగ్రగామిగా ఉందని, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో అడుగులేస్తోందని చెప్పారు. చైనా ప్లస్ వన్ (China Plus One )గమ్యస్థానంగా, ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే పరిశ్రమల అభివృద్ధి, దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళికలకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. అమెరికాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అమ్‌జెన్ (Amgen) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ క్యాపిటల్‌గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. హెల్త్‌కేర్ రంగంలోనూ నంబర్ వన్‌గా నిలిపేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది. అద్భుత ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ బ్రాండ్‌ను మరింత పెంచుతాం. అమ్‌జెన్ వంటి ప్రపంచ అగ్రగామి సంస్థలు రాష్ట్రానికి రావడం కొత్త అవకాశాలను తెస్తుంది. అమ్‌జెన్ కొత్త క్యాంపస్‌లో ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 600, రాబోయే రోజుల్లో 2 వేలకు చేరుతుంది. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలతో అమ్‌జెన్ కలిసి పని చేయాలి అని కోరారు.