Revanth Reddy: రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు అమలు : సీఎం రేవంత్ రెడ్డి

అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ (Babu Jagjivanram Bhavan) లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యాక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కోఠిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ (chakali ilamma) పేరు పెట్టుకున్నాం. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (Integrated Schools) నిర్మిస్తున్నాం. ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు చదువులు వద్దు, కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారు అని అన్నారు.
దళితలు, బీసీలు, గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్టుగా మాజీ సీఎం వ్యవహరించారు. తెలంగాణ వస్తే, ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారు. మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు గానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఉద్యోగాల (Jobs )కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉంది. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారు. అడ్డకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలి. నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారు. ఆర్నెల్లు కూడా విరామం లేకుండా వాళ్ల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు. విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారు అని విమర్శించారు.