తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం భూమిపూజ

గత 10 సంవత్సరాలు పాలించిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడీని ఏర్పాటు చేసుకొని చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారు. అక్కడికి ప్రజలకు నిషేధం విధించారు. మేం ప్రగతి భవన్‌ను, ప్రజాభవన్‌గా మార్చాం. అక్కడే ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాం. సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడి నుంచే విధానపర నిర్ణయాలు తీసుకోవాలి. కానీ గత 10 సంవత్సరాలు అప్పటి సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు సచివాలయంలో అందుబాటులో లేరన్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారు అని అన్నారు.
2004లో కరీంనగర్‌లో ఇచ్చిన మాటను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నిలబెట్టుకున్నారు. ఆమె వల్లే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారమైంది. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్లు ఎన్నెన్నో నిర్మించాం. ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డాం అని గొప్పలు ప్రస్తావించారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ తల్లికంటే వారికే ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఈ పాత విధానాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రజాపాలన చేపట్టింది. డిసెంబర్ 9 రాష్ట్ర ప్రజలకు పండగ రోజు. ఆరోజునే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నాం అని తెలిపారు.