Yellampally Project: గోదావరి జలాల విషయంలో.. ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకం : రేవంత్ రెడ్డి

గోదావరి జలాల విషయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు (Yellampally Project) మనకు కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) , పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తో కలిసి సీఎం వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్ట్రాటజిక్ లోకేషన్‌తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి అని, కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిరదని పేర్కొన్నారు. మేడిగడ్డ పనికిరాకుండా పోయింది. మేడిగడ్డ రిపేరు చేయకుండా అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయొచ్చు కదా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రేవంత్ సమాధానమిచ్చారు. అతి తెలివితేటలతో మామ, అల్లుడు.. ఒకరు స్వాతి ముత్యం, మరొకరు ఆణిముత్యం అనుకుంటారు. మేడారం, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలి. అక్కడి నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. 3 బ్యారేజీల డిజైన్‌లో , నిర్మాణంలో నిర్వహణలో లోపం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి. మేం 80 వేల పుస్తకాలు చదవలేదు, 80 వేల పుస్తకాలు చదివిన మేధావిని సలహా అడుగుతున్నాం. ఏం చేద్దామని, మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం వెళ్తాం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తాం అని స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం పలు సూచనలు చేశారు.