Yadagirigutta: వైభవోపేతంగా స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ

యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ క్రతువు వైభవోపేతంగా జరిగింది. ఉదయం 11:45 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆయన తన సతీమణి గీత (Gita)తో కలిసి ఉదయం 10:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 11 గంటలకు యాదగిరిగుట్ట (Yadagirigutta) హెలిప్యాడ్ చేరుకున్నారు. అక్కడి నుంచి అతిథిగృహానికి వెళ్లి, సంప్రదాయ దుస్తులు ధరించి సీఎం దంపతులు గుట్టపై ఉన్న యాగశాలకు చేరుకుని సుదరశన లక్ష్మీనారసింహ యాగం(Lakshmi Narasimha Yagama)లో పాల్గొన్నారు.
అనంతరం నేరుగా స్వర్ణ గోపురం పై అంతస్తు వరకు వెళ్లి మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పూజలు పూర్తయ్యాక గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. 50.5 అడుగుల ఎత్తు, 10,759 చదరపు అడుగుల వైశాల్యం, 68 కిలోల బంగారం, దాదాపు రూ. 5 కోట్ల ఖర్చుతో తీర్చిదిద్దిన ఈ గోపురం దేశంలోనే ఎత్తయిన బంగారు విమాన గోపురంగా రికార్డులెక్కిందని ఆలయ ఈవో భాస్కర్‌రావు(Bhaskar Rao) ప్రకటించారు.