Revanth Reddy: కొడంగల్ నియోజక వర్గం లో చంద్రవంచ గ్రామం లో సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీ ల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు లను చంద్రవంచ గ్రామం లో ప్రారంభిస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2022 వరకు కొడంగల్(Kodangal) నియోజకవర్గానికి జరగాల్సిన న్యాయం జరగలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి నన్ను ఎమ్మెల్యే గా ఎన్నుకుంటే సోనియా గాంధీ నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా నియమించారు. ముఖ్య మంత్రి అయ్యాక కొడంగల్ కు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్న. భూమికి, విత్తు కు ఎంత అనుబంధమో కాంగ్రెస్ కు రైతులకు అంత అనుబంధం ఉంది.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. యూపీఎ హయాంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ దేశ వ్యాప్తంగా 72 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారు. ఆనాటి ప్రభుత్వం వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని నిరూపించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించాం. ఆగస్టు 15న 22.50 లక్షల రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణవిముక్తి చేశాం. మొదటి విడత రైతు భరోసా లో భాగంగా దాదాపు 7 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేశాం.
దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి యేడాదిలోనే 55,145 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. తెలంగాణలో 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 120 కోట్ల ఆడబిడ్డలు 13 నెలలు గా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఇప్పటి వరకు ఆర్టీసీ కి 4000 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. పేదలను ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
గతంలో రైతు భరోసా సాయం 5000 రూపాయలు ఉంటే ఈ సారి ఎకరానికి యేడాదికి 12 వేల రూపాయలకు పెంచాం. ప్రతి యేడాది 20 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రైతులకు చెల్లిస్తాం. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా సొమ్ము పడుతుంది. రాష్ట్రంలోని లక్షలాది రైతులను ఆదుకోవడం కోసం చంద్రవంచ గ్రామం నుంచి రైతు భరోసా ను ప్రారంభిస్తున్నాం.
నా పాదయాత్రలో అనేక మంది భూమి లేని పేదలు తమకు సాయం అందించాలని కోరారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ప్రతి యేడాది 12 వేల రూపాయలను చెల్లిస్తాం. 10 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా ఆదుకుంటాం.. రాత్రి 12 గంటల తర్వాత వారి ఖాతాల్లో డబ్బులు పడతాయి. ఇందిరమ్మ ఇళ్లు అనగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారు. 2004 నుంచి 2014 వరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. ఒక్క కొడంగల్ లో 34 వేల ఇళ్లు పేదలకు ఇప్పించగలిగాం. కొడంగల్ కు పెద్ద ఎత్తున ఇళ్ల కేటాయింపు పైన కేసీఆర్ కు కడుపు మండి సీబీసీఐడీ విచారణ వేశారు.
కేసీఆర్(KCR) హయాంలో ఎవరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. మార్చి 31 వరకు కొడంగల్ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నాం. కొడంగల్ లో ప్రతి పేదవాడిని ఇంటిని వాడిని చేసే బాధ్యత మీ సోదరుడి గా తీసుకుంటా. వచ్చే నాలుగేళ్లలో 15 నుంచి 20 వేల ఇళ్లు కొడంగల్ లో ఇస్తాం. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ కు, అమెరికాలో చదివి వచ్చిన కేటీఆర్ కు కనీసం పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఝానం లేదు. రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తాం. రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు.. గత పదేళ్లు గా కొత్త రేషన్ కార్డు లు ఇవ్వలేదు. గ్రామ సభ లు పెట్టి అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం.
గత పదేళ్లలో ఎప్పుడైనా గ్రామాల్లో అధికారులను చూశారా. ప్రజలకు జవాబు దారి తనం గా ఉండాలనే అధికారులను గ్రామాలకు పంపించాం. ప్రజల దగ్గరే ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చారు.. ప్రజలే రాజులు, పాలకులు మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రైనా, మంత్రైనా ప్రజల దగ్గరకే వెళ్లాలన్న మార్పు తీసుకువచ్చాం. ఫామ్ హౌస్ లో ఉండి గండి లు కట్టుకొని పాలన చేస్తామంటే కుదరదు. గ్రామసభల్లో అక్కడక్కడ గందరగోళం సృష్టిస్తున్నారు.. కొంతమంది ని ఉసిగొల్పి చిల్లర మల్లర పంచాయతీ లు పెడుతున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటాం..వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తాం. చెప్పింది చేసి చూపిస్తాం.
కాశేశ్వరం కూలిపోయినా ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించాం. సన్న వడ్ల కు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇచ్చాం. పదేళ్లు అయినా పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం మొదలు కాలేదు. కృష్టా జలాలను కొడంగల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే కాళ్ల లో కట్టే పెడుతున్నారు.
గత పాలకులు ఫామ్ హౌస్ లు, వాళ్ల సంపాదన తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి అయితే వాళ్ల మనుగడ ఉండదని అడ్డు పడుతున్నారు. 13 నెలల్లో ఒక్క రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకపోతే ఏమనాలి. ఆయనకు బాధ్యత లేదా..? బాధ్యత లేకపోతే ఆయనకు పదవి ఎందుకు ..? కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమల కోసం 1300 ఎకరాల భూసేకరణ చేశాం. ఇక్కడ ప్రజలను ఆదుకోవాలని పరిశ్రమలు తీసుకువస్తుంటే అధికారులపైన దాడులు చేపించారు. ఎప్పటికీ మనం వెనుకబడే ఉండాలా..?
కొడంగల్ యువకులు ఇంకా లుంగిలుు కట్టుకొని బస్టాండుల్లో తిరగాలా.. కొడంగల్ కు మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ , జూనియర్ కాలేజీలు వద్దా? కేసీఆర్, ఆయన మనుషులు కొడంగల్ అభివృద్ధి కి అడ్డుపడుతున్నారు. కేటీఆర్..మీ ఇంట్లో అందరూ పదవులు తీసుకున్నరు. ఏ పదవులు తీసుకోకుండా మా కుటుంబ సభ్యులు ప్రజల కోసం సేవ చేస్తున్నారు. మా కుటుంబసభ్యులు నాకు అండగా ఉంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. నేను ..నా కుటుంబంలో ఎవరికైనా పదవి ఇచ్చానా..?
మా కుటుంబ సభ్యులు నిస్వార్థంగా పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పుపడుతుందోంది. దోపిడికి మీలాగా మేం పోటీపడం. కష్టాల్లో ప్రజలకు తోడుగా నిలబడే నాయకత్వం మాది.. దోచుకునే నీతి మీది. రాష్ట్రాన్ని దోచుకునేందుకు నా కుటుంబం లేదు. నియోజకవర్గం అభివృద్ధి కోసం సొంతంగా కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టా.
కొండంగల్ నియోజకవర్గం నుంచి నాలుగు పథకాలు రాష్ట్రానికి అంకితం ఇస్తున్నాం. ప్రతి లబ్దిదారుడికి మార్చి 31 నాటికి పథకాలన్నీ అమలు అవుతాయి. 22,500 కోట్ల తో 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. వ్యవసాయ యోగమైన భూములకు మార్చి 31 లోపు 10 వేల కోట్లు రైతులకు ఇస్తాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో భాగంగా 10 లక్షల కుటుంబాలకు 6 వేల రూపాయలు అందిస్తాం. వలస పోయిన కుటుంబాలు కూడా సొంతూరులో రేషన్ కార్డులు తీసుకోవాలి. దావోస్ నుంచి లక్షా డైబ్బై ఎనిమిది వేలకోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చాం.