CM Revanth Reddy: మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ వివరణ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులం గురించి తను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వివరణ ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను మోదీని వ్యక్తిగతంగా తిట్టలేదని చెప్పారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే తాను చెప్పానని, ఈ కారణంతోనే ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నానని రేవంత్ (CM Revanth Reddy) వివరించారు. అయితే తన వ్యాఖ్యలను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అలాగే బీసీలపై ప్రధాన మంత్రి మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలోనే కులగణన చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన కులగణన సమగ్రంగా జరిగిందని, ఈ సర్వేలోని వివరాల ఆధారంగా భవిష్యత్తులో కమిషన్ లేదా కమిటీ వేసి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే విషయంపై కసరత్తులు తెలిపారు. తెలంగాణలో జరిగిన కుల గణన దేశానికి ఒక రోడ్‌మ్యాప్ వంటిదని, దీని ద్వారా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నామని రేవంత్ (CM Revanth Reddy) చెప్పుకొచ్చారు.