Revanth Reddy: అమెరికా విధానాలు ఆర్థిక వృద్ధికి దోహదపడాలి : సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో అమెరికా(America), భారత్ (India) మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. అమెరికాలోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 16 మంది ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, బిజినెస్ లీడర్లు ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల అమెరికా పెంచిన సుంకాలు, హెచ్-1బీ వీసా (H-1B visa) లపై విధించిన కఠిన నిబంధనలతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావం చేయటంతో పాటు, అస్థిరతకు, అపార్థాలకు దారితీస్తాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అని ఆకాంక్షించారు. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలోని ఈ ప్రతినిధి బృందం భారత్‌లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు,వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తోంది.