Revanth Reddy: గ్రూప్-2 ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా…
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నాం. మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి.
గత పాలకుల పాపాల పుట్ట పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్ తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి. సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలి.