కేటీఆర్, సత్య నాదెళ్ళతో బిర్యానీ చర్చ
ఇద్దరూ ప్రముఖులే, వేర్వేరు రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు. వారి మధ్య జరిగే చర్చలు పరిపాలనపరమైనవిగానే, ఆర్థికపరంగానే ఉంటాయి. కాని వీరి మధ్య చర్చలో మరో అంశం కూడా వచ్చింది. అదేమిటంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హైదరాబాదీ బిర్యానీ. మైక్రోసాఫ్ట్ సీఈవోగా వ్యవహరిస్తున్న సత్యా నాదెళ్లతో తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయినప్పుడు బిర్యానీ ప్రస్తావన వచ్చిందట. ఈ విషయాన్ని కెటీఆర్ తన ట్వీట్లో స్వయంగా పేర్కొనడం గమనార్హం. సత్యనాదెళ్లతో భేటీతో ఈ రోజును ప్రారంభించినట్లుగా పేర్కొన్న కేటీఆర్.. తాము వ్యాపారం గురించి.. బిర్యానీ గురించి మాట్లాడుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ రూపంలో అందరికి పంచుకున్నారు.
తన భారత పర్యటన సందర్భంగా సత్య నాదెళ్ల షెడ్యూల్‌ను చూస్తే.. మరే రాష్ట్రానికి చెందిన మంత్రితోనూ ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యింది లేదు. అదే సమయంలో.. ఆయనతో ఎవరైనా భేటీ అయితే.. వ్యాపారం గురించి.. భవిష్యత్తు అవకాశాల గురించి మాత్రమే మాట్లాడే వీలుంది. అంతేతప్పించి.. బిర్యానీ గురించి మాట్లాడే అవకాశమే ఉండదు. అయితే సత్య నాదెళ్ల తొలినాళ్లలో హైదరాబాద్‌లో చాలాకాలం ఉన్నందున ఆయనకు ఇక్కడి ఫుడ్ గురించి అవగాహన ఉండటంతో దానిని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్‌తో చర్చల్లో బిర్యానీ ప్రస్తావన వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. కేటీఆర్ తప్పించి మరెవరూ కూడా ఆయనతో హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడేంత చొరవ తీసుకోరన్నది మాత్రం నిజం. తమ ప్రభుత్వంలో ఐటీకి.. ఐటీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు.. అవకాశాల గురించి చర్చించినట్లుగా కూడా కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.






