BSF: స్మగ్లింగ్, టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో ఐపీఎస్‌లే కీలకం : డీజీ దల్జీత్ సింగ్

మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్, టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో ఐపీఎస్‌లే కీలకమని బీఎస్‌ఎఫ్ (BSF) డీజీ దల్జీత్ సింగ్ చౌదరి (Daljeet Singh Choudhary) అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 77వ ఐపీఎస్ (IPS) బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మానవ హక్కులను కాపాడాలని, ముందున్న సవాళ్లు అధిగమించాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై దృష్టి పెట్టాలన్నారు. ధనవంతులు, పేదవారిని ఒకేలా చూడాలని సూచించారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో పోలీసు సిబ్బంది ఎంతో సహకారం అందించారు. సాయుధ దళాలతో కలిసి పనిచేశారు. సాంకేతికత మీద మాత్రమే ఆధారపడొద్దు. క్షేత్ర స్థాయిలో పని చేయాలి. పోలీసు స్టేషన్ అనేది ప్రతి పౌరుడికి మొదటి నమ్మకం. ఐపీఎస్‌లుగా మీకు ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి. ఆరోగ్యం, ఫిట్‌నెస్ కూడా చాలా ముఖ్యం. మీరు బలంగా ఉంటేనే విధుల్లో సమగ్రంగా రాణించగలరు. కొత్త చట్టాలను పటిష్ఠంగా అమలు చేయండి. క్షేత్రస్థాయిలో ప్రతిరోజు ఒక సవాలే. రాజ్యాంగానికి లోబడి పని చేస్తే ఉన్నతంగా ఉండగలరు. మీరు ఐపీఎస్‌లు మాత్రమే కాదు, పేదలను ఆపద నుంచి కాపాడే సంరక్షకులు అని అన్నారు.