Harish Rao: కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమానికి శ్రీకారం : హరీశ్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని, ఆందుకే ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) ప్రాజెక్టు వల్ల కలిగే నష్టంపై ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై బీఆర్‌ఎస్‌వీ నేతలకు హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఏనాడూ జై తెలంగాణ అనలేదు. ఉద్యమ గుర్తులు, చరిత్ర చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢల్లీికి వెళ్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు (Chandrababu) కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, కృష్ణా, గోదావరి జలాల్లో వాటాను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గురు శిష్యులు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. గోదావరి జలాలను ఏపీకి తరలించే కుట్ర చేస్తున్నారని, రేవంత్ రెడ్డి నిలదీసే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అవసరమైతే బీఆర్‌ఎస్ తరపున సుప్రీంకోర్టుకు వెళ్తాం అని అన్నారు.