Jubilee Hills: జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యత కార్యకర్తలదే : మహేష్ కుమార్ గౌడ్

పదేళ్ల విధ్వంస పాలనకు, రెండేళ్ల వికాస పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) గెలుపు బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే అని అన్నారు. ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలి కాబట్టే నవీన్ యాదవ్ (Naveen Yadav) ను పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిందని వెల్లడించారు. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే ప్రజల మధ్యనే ఉంటారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వ్యక్తి కావాలని నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని విమర్శించారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పదేళ్ల పాలనలో ఎలా జరిగిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మయంగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని వ్యాఖ్యలు చేశారు. యువతను మత్తుకు బానిస చేశారని ఆరోపించారు.