KCR: అజ్ఞాతం వీడబోతున్న కేసీఆర్.. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ..!!

తెలంగాణలో (Telangana) ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పూర్తిగా ఫాంహౌస్ (Farm house) కే పరిమితమయ్యారు. తెలంగాణను సాధించిన నేతగా కేసీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆయన్ను ప్రజలు పదేళ్లపాటు ఆదరించారు. అధికారంలో కూర్చోబెట్టారు. అయితే 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ ను ఓడించారు. కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపంచారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలన ఏడాది పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లూ కేసీఆర్ పూర్తిగా ఫాంహౌస్ కు మాత్రమే పరిమితమయ్యారు. అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. అయితే ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ జహీరాబాద్ (Zaheerabad) కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది పాదయాత్రగా (padayatra) ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్ కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ వాళ్లతో మాట్లాడారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా తాను మోనంగా, గంబీరంగా చూస్తున్నానని.. తాను కొడితే మామూలుగా ఉండాదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుతాం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరని.. వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని కేసీఆర్ చెప్పారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని గుర్తు చేశారు.
నేను చెప్పినా ప్రజలు వినలేదని… అత్యాశకు పోయి కాంగ్రెస్ కి ఓటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధుకి రాం రాం, దళితబంధుకి జై భీం చెబుతారని తాను ఆనాడే చెప్పానన్నారు కేసీఆర్. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారన్నారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనని.. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని ఆకాంక్షించారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయని చెప్పారు. చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడిందని, సర్వనాశనం అయిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడేనన్న కేసీఆర్.. ప్రాణం పోయినా సరే తెగించి కొట్లాడేది మనమేనని, తెలంగాణకి రక్షణగా ఉంటామని స్పష్టం చేశారు. ఏడాది నుంచి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు లిచిపోయాయని చెప్పారు.
ఇప్పుడిప్పుడే అన్ని మబ్బులు తొలగిపోయి నిజాలు బయటకు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ప్రజలకు మంచి ఏందో చెడు ఏందో అర్థమవుతోందన్నారు. మాట్లాడితే ఫాంహౌస్ అని బద్నాం చేస్తున్నారని.. ఇక్కడ పంటలు తప్ప ఏమున్నాయని ఆయన ప్రశ్నించారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహరంగ సభ పెట్టుకుందామని.. మన సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు చెప్పారు. దీన్ని బట్టి కేసీఆర్ జనాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే కనీసం ఏడాది సమయం ఇచ్చిన తర్వాత స్పందిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు ఏడాది పూర్తి కావడంతో జనంలోకి రావాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.