Phone Tapping: గవర్నర్ ఫోన్ ట్యాప్..! బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి..!?

తెలంగాణలో (Telangana) ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు పలువురి నేతల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయనే ఆరోపణలున్నాయి. రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అధికారంలోకి వచ్చాయ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. కేసు నమోదైన వెంటనే పలువురు నేతలు ముందుకొచ్చి తమ ఫోన్లను కూడా బీఆర్ఎస్ ట్యాప్ చేసిందని ఫిర్యాదులు చేశారు. పలువురు బీజేపీ (BJP) నేతలు కూడా ఇందులో ఉన్నారు. తాజాగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి (Tripura Governor Indrasena Reddy) ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో SIB OSD ప్రభాకర్ రావు (Prabhakar Rao) నేతృత్వంలో పలువురు నేతల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పటి SIB అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ తదితరులను అరెస్టు చేసింది. ప్రభాకర్ రావుతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ కుమార్ అమెరికాకు వెళ్లి తలదాచుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో త్రిపుర గవర్నర్ విద్యాసాగర్ ఫోన్ కూడా ట్యాపింగ్ గురైనట్లు గుర్తించారు.
2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య 15 రోజులపాటు విద్యాసాగర్ రావు ఫోన్ ను ట్యాప్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి విద్యాసాగర్ రావు పీఏ సిట్ (SIT) ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. 2023 అక్టోబర్ 19న విద్యాసాగర్ రావు త్రిపుర గవర్నర్ గా నియమితులయ్యారు. గవర్నర్ గా నియమితులైన నెలరోజుల్లోనే ఆయన ఫోన్ ను ఎందుకు ట్యాప్ చేశారనేది అర్థం కావట్లేదు. తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని గతంలోనే విద్యాసాగర్ రావు ఫిర్యాదు చేశారు. ఇది నిజమేనని ఇప్పుడు తేలడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 3వందల మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సమాచారం. అంతేకాక పలువురు జర్నలిస్టులు, మీడియా అధిపతులు, కేంద్ర మంత్రుల ఫోన్లపై కూడా నిఘాపెట్టారనే ఆరోపణలున్నాయి. వీటని నిగ్గు తేల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. SIBలో హార్డ్ డిస్క్ లను మాయం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజమేనని అనుమానాలు తలెత్తాయి. అయితే కేంద్ర పెద్దల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలపై బీజేపీ ఆగ్రహంతో ఉంది. సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఈ కేసును సీబీఐకి (CBI) అప్పగిస్తే బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.