ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ సానుభూతి పలుకులు: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని, అందుకే తమ పార్టీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు, వారి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ అన్నారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు శుక్రవారం నాడు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగ్గా.. ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో వారంతా బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
వంద రోజుల పాలనను రెఫరెండంగా భావించి ఓటు వేయాలని గతంలో అనేకసార్లు సీఎం రేవంత్ చెప్పారంటూ గుర్తు చేసిన లక్ష్మణ్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో దీనిపై పూర్తి వ్యతిరేకత ఏర్పడడంతో ఇప్పుడు వారి దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఇప్పటివరకు రైతు రుణమాఫీ కూడా అమలు చేయలేదు. అందుకే ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలంటూ వాళ్లని మళ్లీ మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే అన్ని గ్యారంటీలు నెరవేరుతాయని కాంగ్రెస్ అనడం బోడి గుండుకు, మోకాలికి ముడిపెట్టడం లాంటిదే’’ అంటూ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
అలాగే రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైందని, అందుకే ఒకప్పుడు మాటల తూటాలు పేల్చిన ఆయన ఇప్పుడు సానుభూతి కోసం వెంపర్లాడుతున్నాడన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను దారి మళ్లించేందుకే తనపై కుట్ర జరుగుతోందంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు వస్తే అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేసిన ఎంపీ లక్ష్మణ్.. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తమ అభ్యర్థి మాధవీలతను ఎదుర్కోలేక ఓవైసీకి ముచ్చెమటలు పడుతున్నాయని, అందుకే ఆయన్ని గెలిపించడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.